అప్పుడే మనది ప్రజాస్వామ్య దేశం

అప్పుడే మనది ప్రజాస్వామ్య దేశండాక్టర్‌ ఊర్వశి సాహ్ని... మహిళా హక్కుల కార్యకర్త, విద్యావేత్త. బాలికల విద్య, విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా పాఠశాలల్లో, పాఠ్యాంశాల్లో సంస్కరణలు అవసరమని గుర్తించారు. దీని కోసమే 30 ఏండ్ల కిందట స్టడీ హాల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. ఆ వైపుగా ఉపాధ్యయులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాగే బాలికల కోసం ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ‘దేశంలోని పిల్లలందరికీ నాణ్యమైన, లోతైన విద్య అందినప్పుడే మనది ప్రజాస్వాయ్య దేశం అవుతుంది’ అంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఫౌండేషన్‌ నడిపే క్రమంలో మీరు ఎదుర్కొన్న ప్రాధమిక సవాలు?
కుటుంబంలో, సమాజంలో బలంగా ఉన్న పితృస్వామ్య భావజాలం బాలికలు, మహిళల జీవితాలను పరిమితం చేసే సామాజిక నిబంధనలు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇదంతా చాలా సహజమని అందరూ భావిస్తాను. వివక్షను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న అమ్మాయిలు నేను సమానమని, నాకు నచ్చినట్టు జీవించే హక్కు ఉందని తెలుసుకోవడం ప్రాథమిక సవాలు. దీనిపై నిరసన తెలిపే విధంగా అమ్మాయిలని తీర్చిదిద్దాలి. వాళ్ళను హక్కుల కోసం పోరాడే శక్తులుగా మార్చాలి.
ఈ ప్రయాణంలో మీకు గొప్ప ఆనందాన్ని కలిగించింది ఏమిటి?
మా విద్యార్థులు అసమానతలతో పోరాడడం, మనుగడ సాగించడం, అభివృద్ధి చెందడం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. వారు తమను తాము అభివృద్ధి చేసుకోవడమే కాకుండా వారి కుటుంబాలు పేదరికం నుండి బయట పడేందుకు అండగా నిలబడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా అభివృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నారు. వారిలో చాలా మంది ఇప్పుడు వారి సొంత హక్కుల కోసం గట్టిగా మాట్లాడుతున్నారు. అలాగే వారి కమ్యూనిటీలలో లింగ సమానత్వానికి ఛాంపియన్‌లుగా ఉన్నారు. అలాగే అబ్బాయిలు కూడా లింగ సమానత్వం కోసం అమ్మాయిలకు అండగా నిలబడుతున్నారు. వారి హక్కుల కోసం వారి సోదరీమణులతో కలిసి పోరాడుతున్నారు.
ఇప్పటి వరకు మీరు ఎంత మంది జీవితాలను ప్రభావితం చేయగలిగారు?
సంస్థ ఆధ్వర్యంలో మేము ముందుగా తల్లులకు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు అవసరమైన ఆర్థిక వనురులను ఏర్పాటు చేయాలనుకున్నాము. దాని కోసం సాహ్ని దీదీ అనే క్యాటరింగ్‌, టైలరింగ్‌ వెంచర్‌ను ప్రారంభించాము. ఇది కార్పొరేట్‌ ఆఫీసులకు భోజనాలు అందించడంలో లక్నోలో మంచి కృషి చేస్తున్నది. దీని ద్వారా మహిళల ఆదాయం రెట్టింపు అయ్యింది. ఫలితంగా వారు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకు వస్తున్నారు. మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లోని 993 ప్రభుత్వ పాఠశాలల్లో కృషి చేస్తున్నాము. 24వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాము. 501,000 మంది బాలికలకు నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించాము.
మిమ్మల్ని కొనసాగించేది ఏమిటి?
నేటికీ సమాజంలో నెలకొన్న లింగ అసమానత వల్ల సమస్య పరిష్కారానికి దూరంగా ఉంది. కాబట్టి మేము ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయినా నేటి వరకు మా అబ్బాయిలు, అమ్మాయిలతో కలిసి మేము సాధించిన విజయం నాకు కొనసాగడానికి శక్తితో పాటు ఇంకా సాధించగలం అనే ఆశ, ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఇదే నేను నా పనిని కొనసాగించడానికి ముఖ్య కారణం.
మహిళా హక్కుల కార్యకర్తగా, విద్యావేత్తగా సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
లింగ వివక్ష లేని ప్రపంచం మనందరికీ మంచిది. మన ఇళ్లలో, మన కమ్యూనిటీలలో, మన దేశంలో దానిని సాధించడానికి మనమందరం కలిసి పోరాడాలి. ఇంట్లో, సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన పౌరులుగా ఉండే హక్కును కల్పించకుండా మన దేశం పూర్తి సామర్ధ్యాన్ని సాధించలేదు. దేశంలో విద్యా అవకాశాలు లోతుగా, విస్తృతంగా ఉండాలి. అప్పటి వరకు భారతదేశం పూర్తి ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకోలేము.
వెనుకబడిన పిల్లల కోసం…
ప్రస్తుతం ఊర్వశి పట్టణ ప్రాంతాలలోని మురికివాడలకు చెందిన సుమారు 1,000 మంది బాలికలకు స్వయంగా నాణ్యతమైన విద్యను అందిస్తు న్నారు. స్టడీ హాల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ నేరుగా 4,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది. ఇందులో మధ్యతరగతి పట్టణ పిల్లలు, పేద ప్రాంతాల నుండి వెనుక బడిన బాలికలు, అబ్బాయిలు, బడి బయట పిల్లలు, గ్రామీణ పిల్లలు కూడా ఉంటారు. ఊర్వశి చేస్తున్న కార్యక్రమాలు ఒబామా ఫౌండేషన్‌ గ్లోబల్‌ గర్ల్స్‌ అలయన్స్‌, క్లింటన్‌ ఫౌండేషన్‌లు కూడా గుర్తించాయి.
సామాజిక సంస్థ
ఊర్వశి 1983లో సురక్ష అనే మహిళా హక్కుల సంస్థను స్థాపించారు. డిజిటల్‌ స్టడీ హాల్‌కు సహ వ్యవస్థాపకురాలిగా, డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఫౌండేషన్‌ ద్వారా అభివృద్ధి చేయబడిన బోధనా పద్ధతులను ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ, పట్టణ పాఠశాలలకు విస్తరించింది. లక్ష మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం పంచుకున్నారు. ఆమె మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించే దీదీ అనే సామాజిక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. స్టడీ హాల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భారతదేశంలో విద్యను సంస్కరించడానికి, బాలికల విద్యను పెంపొందించడానికి ఆమె చేసిన కృషికి 1994లో బర్కిలీ హాస్‌ అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే 2011లో అశోక ఫెలోషిప్‌ను అందుకున్నారు. 2017లో సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సైతం పొందారు.

Spread the love