అప్పుడే వెనక్కి తగ్గుతాం..

– రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని అమలు చేస్తే ఆయుధాలు విడనాడుతాం : హమాస్‌ అధికారి
ఇస్తాంబుల్‌: 1967కి ముందునాటి సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడినట్లైతే తాము ఆయుధాలు విడనాడి రాజకీయ పార్టీగా మారతామని హమాస్‌ వ్యాఖ్యానించింది. హమాస్‌ ఉన్నతాధికారి ఖలీల్‌ అల్‌ హయ్యా బుధవారం మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో నెలల తరబడి కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారమన్న షరతు గనక నెరవేరినట్లైతే ఇజ్రాయిల్‌తో ఐదేళ్ళు అంతకుమించి ఒప్పందం కుదుర్చుకోవడానికి, రాజకీయ పార్టీగా మారడానికి సుముఖంగా వున్నామని చెప్పారు. తాజా చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సమ యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే హమాస్‌ను తుదకంటా నిర్మూలించాలనే లక్ష్యంతో వున్న ఇజ్రాయిల్‌ ఈ ప్రతిపాదనను పరిశీలించే అవకాశాలు కూడా కనిపించడం లేదు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయి ల్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం కాల్పుల విరమణకు, బందీల మార్పిడి కోసం జరుగుతు న్న చర్చల్లో పాలస్తీనాకు ఖలీల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లకు ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రత్యర్ధి ఫతా వర్గం నేతృతంలోని పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌తో హమాస్‌ చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Spread the love