బెంగళూర్‌ మురిసింది

– సన్‌రైజర్స్‌పై 35 పరుగులతో గెలుపు
– విరాట్‌ కోహ్లి, రజత్‌ అర్థ సెంచరీలు
– బెంగళూర్‌ 206/7, హైదరాబాద్‌ 171/8
ఆతిథ్య జట్టుకు ఉప్పల్‌లో చుక్కెదురైంది. 207 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చతికిల పడింది. ట్రావిశ్‌ హెడ్‌ (1), హెన్రిచ్‌ క్లాసెన్‌ (7), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (7) వైఫ్యలంతో ఛేదనలో హైదరాబాద్‌ నిరాశపరిచింది. పేసర్లు, స్పిన్నర్లు రాణించటంతో బెంగళూర్‌ సీజన్లో రెండో విజయం నమోదు చేసింది. విరాట్‌ కోహ్లి (51), రజత్‌ పాటిదార్‌ (50) అర్ధ సెంచరీలకు తోడు కామెరూన్‌ గ్రీన్‌ (37 నాటౌట్‌) రాణించటంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మురిసింది. ఐపీఎల్‌ 17లో సుమారు నెల రోజుల తర్వాత మరో విజయం ఖాతాలో వేసుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 35 పరుగుల తేడాతో గెలుపొందిన ఆర్సీబీ సీజన్లో రెండో విజయం సాధించింది. 207 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులే చేసింది. ట్రావిశ్‌ హెడ్‌ (1), హెన్రిచ్‌ క్లాసెన్‌ (7), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (7), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13), అబ్దుల్‌ సమద్‌ (10) విఫలమయ్యారు. అభిషేక్‌ శర్మ (31, 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాబాజ్‌ అహ్మద్‌ (40 నాటౌట్‌, 37 బంతుల్లో 1 ఫోర్‌,1 సిక్స్‌) పోరాడినా సహచరుల నుంచి మద్దతు లభించలేదు. ఆర్సీబీ బౌలర్లలో కరణ్‌ శర్మ (2/29), స్వప్నిల్‌ సింగ్‌ (2/40), కామెరూన్‌ గ్రీన్‌ (2/12) రాణించారు. అంతకుముందు, విరాట్‌ కోహ్లి (51, 43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), రజత్‌ పాటిదార్‌ (50, 20 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. కామెరూన్‌ గ్రీన్‌ (37 నాటౌట్‌, 5 ఫోర్లు) సైతం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరవటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో జైదేవ్‌ ఉనద్కత్‌ (3/30), నటరాజన్‌ (2/39) వికెట్ల వేటలో రాణించారు.
బెంగళూర్‌ దూకుడు : ఉప్పల్‌లో టాస్‌ నెగ్గిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించి ఇతర జట్లు చేసిన పొరపాట్ల నుంచి ఆర్సీబీ పాఠాలు నేర్చుకుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఓపెనర్లు ధనాధన్‌ ఆరంభం అందించారు. సన్‌రైజర్స్‌ శైలిలోనే పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌గా ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. విరాట్‌ కోహ్లి (51), కెప్టెన్‌ డుప్లెసిస్‌ (25) తొలి వికెట్‌కు మంచి ఆరంభం అందించారు. పాట్‌ కమిన్స్‌ ఓవర్లో కోహ్లి, డుప్లెసిస్‌ కదం తొక్కారు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నారు. 3 ఓవర్లలో 43/0తో నిలిచిన బెంగళూర్‌ భారీ స్కోరు దిశగా గట్టి పునాది వేసుకుంది. కానీ ఆ తర్వాతి ఓవర్లో నటరాజన్‌ సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. డుప్లెసిస్‌ (25)ను అవుట్‌ చేసి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ జోరుకు కళ్లెం వేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 61/1తో నిలిచింది. విల్‌ జాక్స్‌ (6)ను మార్కండే సాగనంపటంతో బెంగళూర్‌ మరింత ఢలాీ పడింది. కానీ రజత్‌ పాటిదార్‌ (50) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మయాంక్‌ మార్కండే ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టిన పాటిదార్‌ ఆ ఓవర్లో 27 పరుగులు పిండుకున్నాడు. పాటిదార్‌ జోరుతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ మళ్లీ జోరందుకుంది. రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 19 బంతుల్లోనే పాటిదార్‌ అర్థ సెంచరీ సాధించగా.. విరాట్‌ కోహ్లి నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 బంతుల్లో అర్థ శతకం బాదాడు. అర్థ సెంచరీల అనంతరం కోహ్లి,పాటిదార్‌ వికెట్‌ కోల్పోయారు. కానీ కామెరూన్‌ గ్రీన్‌ (00) డెత్‌ ఓవర్లలో దంచికొట్టాడు. ఐదు బౌండరీలు బాదిన కామెరూన్‌ గ్రీన్‌ కీలక సమయంలో విలువైన పరుగులు చేశాడు. ఆఖరు ఓవర్లో స్వప్నిల్‌ సింగ్‌ (12) ఆకట్టుకున్నాడు. నటరాజన్‌పై వరుసగా 6, 4తో ఆర్సీబీ స్కోరు 200 మార్క్‌ దాటించాడు. మహిపాల్‌ లామ్రోర్‌ (7), దినేశ్‌ కార్తీక్‌ (11) నిరాశపరిచారు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి రాయల్‌ చాలెంజర్స్‌ 206 పరుగులు చేసింది.
భారీ బందోబస్తు : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మ్యాచ్‌కు హైదరాబాద్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచులకు 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మాకాలపై పారదర్శకత కోరుతూ యూత్‌ కాంగ్రెస్‌ ఉప్పల్‌ స్టేడియం దగ్గర ధర్నాకు దిగారు. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మ్యాచ్‌కు ఎటువంటి అవాంతరం కలుగకుండా 3800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు.

Spread the love