16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌ రన్‌

16 Palamuru-Ranga Reddy Wet run– ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం
– నార్లాపూర్‌లో స్విచ్చాన్‌ చేయనున్న సీఎం కేసీఆర్‌
– 17న దేవుళ్ల పాదాలు కడగాలంటూ పిలుపు
– సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు
న్రవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈనెల 16న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్‌ ఇన్‌టేక్‌ నుంచి బటన్‌ నొక్కి బాహుబలి పంపు ద్వారా కష్ణా జలాలను ఎత్తిపోయనున్నారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలను తీర్చనున్నామని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకుల నుంచి మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్ధాల కల సాకారమవుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజనీ సీఎం వ్యాఖ్యానించారు. అందుకోసం ప్రారంభమైన తెల్లారి ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెల్లో ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలని సూచించారు. ప్రారంబానికి గ్రామాల నుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలషాలు తెచ్చుకుని వాటితో తీసుకెల్లిన కష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం డా బిఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వల తవ్వకంతోపాటు దానికి సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే డ్రైరన్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని వెట్‌రన్‌ను సిద్ధంగా ఉన్నట్టు సమావేశంలో పాల్గొన్న ఇంజినీరింగ్‌ అధికారులు సీఎంకు వివరించారు. ఇంజినీర్ల సూచనల మేరకు ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్‌ ప్రారంభం కానున్నది. కష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్‌ ప్లో వద్ద) నార్లాపూర్‌ వద్ద నిర్మించిన ఇన్‌టేక్‌ వద్దకు చేరుకుని అక్కడ స్విచ్‌ ఆన్‌ చేసి పంపులను ప్రారంభిస్తారు. దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లెనుంచీ సర్పంచులు గ్రామస్థులు ఈ బహిరంగ సభకు హాజరుకావాలని చెప్పారు.

Spread the love