పలరాజుకు కష్టకాలం.?

– మామిడి దిగుబడులను కాటేసిన తెగుళ్లు
– డిమాండ్ ఉన్న తప్పని కష్టాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పలరాజుగా పేరుగాంచిన మామిడికి కష్టకాలం వచ్చింది.అనావృష్టి, తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. గతేడాది తెగుళ్లు కారణంగా పంట దిగుబడి పడిపోగా, ఈ ఏడాది తెగుళ్లకు తోడుగా కనీస వర్షపాతం లేక దెబ్బతీసింది. అయితే అరకొరగా వచ్చిన దిగుబడికి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ చుట్టూ పట్టణాల్లో మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించక తప్పడం లేదు. పంట నాణ్యత ఆధారంగా మార్కెట్ లో టన్నుకు రూ.80 వేల ధర పలుకుతోంది. మండలంలో ఎక్కువగా తాడిచెర్ల,రుద్రారం,కాపురం గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో  మామిడి తోటలున్నాయి. ఇందులో భిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు,దేశాలకు ఎగుమతయ్యే బంగినిపల్లి,తోతపూరి,రసాలు,హిమాయత్, దశేరి,మల్లికా,మంజీర వంటి రకాలను పండిస్తున్నారు.
తెగుళ్లు ప్రతికూల పరిస్థితులు..
 మామిడి తోటలకు ఈ ఏడాది అది నుంచి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి.వాతావరణం అనుకూలించక పూత ఆలస్యంగా వచ్చింది. డిసెంబర్ లో రావాల్సిన పూత జనవరిలో వచ్చింది. అక్కడక్కడా ఫిబ్రవరిలో కూడా పూత వచ్చింది.మిరప తోటలను ఆశించి దెబ్బతీసిన తామర పురుగు మామిడి తోటలను కూడా ఆశించింది.రైతులు గుర్తించి నివారణ చర్యలు చేపట్టే సమయానికే పూత రాలిపోయింది. అక్కడక్కడా నిలిసిన పిందెను కూడా నల్లి తెగులు ఆశించింది. మామిడి ఎకరాకు కౌలు రూ.40 వేల వరకు ఉంటుంది ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏడాది ఎకరాకు రూ.20 వేల వరకు మించి కౌలు లభించడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు.మామిడి ఎకరాకు 4 తన్నుల దిగుబడి వస్తుంది.ఈ ఏడాది ఎకరాకు తన్నుకు మించి దిగుబడి రావడం లేదని మామిడి రైతులు వాపోతున్నారు.
డిమాండ్ ఉన్న సైజ్ లేదు..
మామిడి మార్కెట్ లో భలే డిమాండ్ ఉంది. అందుకు తగిన నాణ్యమైన పంట లభ్యత లేదు. అధికంగా మార్కెట్ లోకి వచ్చే బంగినిపల్లి మామిడి కాయ 350 గ్రాములు ఉంటుంది. ఈ ఏడాది తగిన వర్షపాతం లేక 300 గ్రాములకు మించి బరువు రాలేదు. ఇక దిగుబడులు బాగా తగ్గడంతో పంటకు డిమాండ్ పెరిగింది.
Spread the love