వైద్యం కరువై..ప్రజల ఇబ్బందులు

– సమయపాలన పాటించని సిబ్బంది
– ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
– వసతులు లేకపోవడంతో రోగుల అవస్థలు
– విధి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో బంట్వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారుతుంది. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు మందులు అందిస్తున్నప్పటికీ వాటిని అందించడంలో వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంట్వారం ప్రభుత్వ ఆస్పత్రి పరిధిలో 11 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల నుంచి నిత్యం రోగులు మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వైద్యం కోసం వస్తుంటారు. అయితే అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో వచ్చిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నవతెలంగాణ-బంట్వారం
ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో గర్భిణులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యం 24 గంటలు అందిస్తామని చెబుతున్న అవన్నీ కార్యరూపం దాల్చే పరిస్థితి లేదు. బంట్వారం ఆస్పత్రిలో కొందరు వైద్యులు, ఉద్యోగులు ఉదయం 10:30 గంటల నుంచి , మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రోగుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు లేని సమయంలో ఏదో ఒక మాత్రలను రోగులకు అందించి సిబ్బంది తమకు తోచిన వైద్యం అందిస్తున్నట్టు సమాచారం. సాంకేతికత పెరిగిన ఇంకా వైద్యులు ఏ సమయానికి వస్తున్నారు ఏ సమయానికి వెళ్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారాలు గ్రహించే పరిస్థితి ఇక్కడ లేదంటే అతిశయోక్తి కాదు. సంతకాలు పెట్టి ఇతర పనులపై కొందరు వైద్యులు బయటకు వెళ్తున్నాట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వైద్యులు ఉద్యోగులు సమయపాలన పాటిస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకొని రోగులకు వైద్యం అందించాలని కోరుతున్నారు.
ఒకే డాక్టర్‌ తోరోగులకు తిప్పలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఆఫీసర్‌ మానస హర్ష విధులు నిర్వహిస్తున్నారు. బంట్వారం మండల పరిధిలో 11 గ్రామపంచాయతీల నుంచి అనేక మంది రోగులు వస్తుంటారు. ఒకే డాక్టర్‌తో సేవలు అందించాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి వేళ్లలో డాక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఆదివారం ఉన్న ఒక్క డాక్టర్‌ సెలవుల్లో ఉంటుండంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్‌ అయిన వ్యక్తులు గానీ ఇతర రోగులు ఆస్పత్రికి వస్తే ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతా ధికారులు స్పందించి మందులు, సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సిబ్బందిని నియమించాలి
బంట్వారం పీహెచ్‌సీకి వైద్యం కోసం రోగులు, గర్భిణులు వచ్చినప్పుడు సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది సమయానికి రావడం లేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూడాలి. ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది, ముందులను అందుబాటులో ఉంచాలి.
– ఆర్‌.మహిపాల్‌, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి

Spread the love