ప్రముఖ హాస్య నటుడు మృతి..!

నవతెలంగాణ – హైదరాబాద్
అమెరికన్‌ హాస్య నటుడు పాల్‌ రూబెన్స్‌ మరణించాడు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న పాల్‌ ఆదివారం అర్థరాత్రి మరణించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక పాల్‌ 80వ దశకంలో పీ వీ హర్మన్‌ పాత్రతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హే హే హే అంటూ విలక్షణ నవ్వుతో అప్పట్లో చిన్న పిల్లలకు హాట్‌ ఫేవరైట్‌ అయిపోయాడు. పాల్‌ తనకు క్యాన్సర్‌ ఉందని ఎప్పుడు వెల్లడించలేదని తనకు అత్యంత సన్నిహితులైన వాళ్లు ఓ మీడియాతో చెప్పారు. అయితే దాని గురించి పాల్‌ తను ఆరు సంవత్సరాలుగా పోరాడుతున్న ఈ క్యాన్సర్‌ మహామ్మారి గురించి చెప్పనందకు తనను క్షమించమని, తన స్నేహితులు, అభిమానుల ప్రేమ వెలకట్టలేదని, అందరినీ తను చాలా ప్రేమిస్తున్నాడని తను చనిపోయేముందు ఓ నోట్‌ రాశాడు. ఇక పాల్ 2001లో వచ్చిన బ్లో సినిమాలో డ్రగ్స్‌ డీలింగ్‌ హేయిర్‌ డ్రెస్సర్‌గా చేసిన రోల్‌కు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. చివరగా పాల్ పీ వీస్‌ బిగ్‌ హాలీడే సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు రైటర్‌, ప్రొడ్యూసర్‌ కూడా ఆయనే. టెలివిజన్‌ రంగంలోనూ పాల్ తనదైన ముద్ర వేసుకున్నాడు.

Spread the love