రాహుల్‌ తీరు సరికాదు

– మా వల్లే వ్యవసాయ చట్టాలు ఆగిపోయాయి
– తమిళనాడు గవర్నర్‌ను తొలగించాలి : బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేకే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను తమ పార్టీ సమర్థించిందంటూ ఖమ్మం సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదమని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాసరెడ్డి, రాములు, కొత్త ప్రభాకరరెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేకే మాట్లాడారు. పార్లమెంటులో వ్యవసాయ నల్ల చట్టాలను తమ పార్టీ వ్యతిరేకించిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆ సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే బీఆర్‌ఎస్‌ కారణంగానే ఆయా నల్ల చట్టాలను మోడీ సర్కార్‌ ఉపసంహరించుకుందని వివరించారు. కానీ వాటిని తాము సమర్థించినట్టు ఓ జాతీయ నేత (రాహుల్‌ గాంధీ) చెప్పటం సరికాదన్నారు. రాహుల్‌ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. రాహుల్‌ తన ప్రసంగం ఆసాంతం అబద్ధాలనే వల్లే వేశారని విమర్శించారు. తమ పార్టీ మాదిరిగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మరే పార్టీ పోరాడటం లేదని చెప్పారు. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా కలుస్తున్న పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ముందుంటుందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో విపక్షాల సమావేశానికి సంబంధించి బీఆర్‌ఎస్‌ వస్తే… తాము హాజరు కాలేమంటూ రాహుల్‌ చెప్పా రని వివరించారు. ఈ మాటను ఆయన గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నిం చారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే లక్షణాలు రాహుల్‌కు లేవని ఎద్దేవా చేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించి, దాన్ని అవ మానించిన తమిళనాడు గవర్నర్‌ను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని కేకే ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. నామా మాట్లాడుతూ… బీజేపీకి దగ్గరగా వ్యవహరించేది కాంగ్రెస్‌ పార్టీయేనని విమర్శించారు. పార్లమెంటు లో ప్రధానిని కౌగిలించుకున్నది ఎవరంటూ పరోక్షంగా రాహుల్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఏనాడూ పోరాడలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఒకరకంగా, తెలంగాణలో మరో రకంగా మాట్లాడటం రాహుల్‌కే చెల్లిందని విమర్శించారు. దేశంలో వ్యవసాయం, రైతుల గురించి ఆలోచించేది కేవలం కేసీఆర్‌ మాత్రమేనని అన్నారు.
పప్పు అనటంలో తప్పు లేదు :రాహుల్‌పై మంత్రులు వేముల, పువ్వాడ విమర్శలు
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని గతంలో పప్పు అని ఎవరైనా సంబోధిస్తే కొంచెం బాధ అనిపించేదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కానీ ఖమ్మం సభ తర్వాత ఆయన్ను పప్పు అనటంలో ఎలాంటి తప్పూ లేదనే భావనకు తామొచ్చామని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ అజయకుమార్‌, ప్రభుత్వ విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, సురేందర్‌, సండ్ర వెంకటవీరయ్య తదితరులతో కలిసి వేముల మాట్లాడారు. రాహుల్‌ గాంధీ.. ఒక రిమోట్‌ గాంధీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఖమ్మం సభ వచ్చా మా.. మాట్లాడామా.. పోయామా… అన్నట్టుగా సాగిందని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే చదివి వెళ్లిపోయిన ఆయనకు ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వేముల వ్యాఖ్యానించారు. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసునని విమర్శించారు.

Spread the love