నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లిలోని జేవీఆర్ ఉపరితల బొగ్గు గనిలోని (ఓపెన్ కాస్ట్ బొగ్గు గని) బొగ్గు నిర్వహణ ప్లాంట్ (సీహెచ్‌పీ)ని రైల్వే బోర్డు కార్యనిర్వాహక సంచాలకులు, రవాణా విభాగం (బొగ్గు) సయ్యద్ అబ్దుల్ రెహమాన్ శనివారం సందర్శించారు. భారతీయ రైల్వే వే ట్రాఫిక్ రవాణా సేవల కార్యనిర్వాహక సంచాలకులు (బొగ్గు రవాణా) బి. వెంకన్న, సికింద్రాబాద్ విభాగపు సీనియర్ నిర్వహణ అధికారి డి. నరేంద్ర వర్మ, సత్తుపల్లి ప్రాంత ముఖ్యాధికారి (జీఎం) చింతల శ్రీనివాస్‌లతో కలిసి ఆయన ఈ సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఆవరణలో అధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం జేవీఆర్ ప్లాంట్ లోని బొగ్గు నిల్వ స్థలం, రైల్వే బొగ్గు నింపే ప్రాంతాలు, సంకేత వ్యవస్థను వారు క్షుణ్ణంగా నిశిత పరిశీలన చేశారు.
సత్తుపల్లి ప్రాంతంలో రైలు మార్గం ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణా వివరాలను బి. వెంకన్న, జీఎం చింతల శ్రీనివాస్ ఈడీ సయ్యద్ అబ్దుల్ రెహమాన్‌కు వివరించారు. రాబోయే రోజుల్లో సత్తుపల్లి రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణాను మరింత పెంచే అవకాశాలపై ఈ భేటీలో వారు ప్రధానంగా చర్చించారు. రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచి, బొగ్గు పంపే ప్రక్రియను వేగవంతం చేయడంపై అధికారులకు ఈడీ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో సీనియర్ నిర్వహణ అధికారి డి. నరేంద్ర వర్మ, కార్యనిర్వాహక సంచాలకులు (బొగ్గు రవాణా) బి. వెంకన్న, సత్తుపల్లి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ప్రాంతీయ ఇంజనీర్ కె. సోమశేఖరరావు ఎస్ ఓ టు బొల్లం శ్రీనివాస్, ప్లాంట్ పరికరాల సహాయక ఇంజనీర్ ఈ&ఎం) సాయినాథ్, ఎస్ఈ (సివిల్) ఎ. రవికుమార్, ఇతర రైల్వే, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.



