రేపు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణ చేతులమీదుగా అవార్డును అందుకోనున్న సర్పంచ్
నవతెలంగాణ-నవాబు పేట
నవాబుపేట గ్రామానికి చెందిన జేకే ట్రస్ట్ డైరెక్టర్, గ్రామ సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ,రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ సిద్ధాంతాలను అమలు చేస్తూ గ్రామంలో ఎన్నో రకాల సేవలను అందిస్తున్నందుకు ప్రజల ఆపదలో ఉన్నప్పుడు నేనున్నాను అనే గొప్ప మనస్సుతో అక్కున చేర్చుకుని వారికి అండగా నిలిచిన జేకే ట్రస్ట్ డైరెక్టర్లు గీతారాణిసుధాకర్ చారి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
జేకే ట్రస్ట్ సేవలను అందిస్తున్నందుకు ప్రజల నుంచి విశేష స్పందన, ఆదరణ పొందిన వారికి సేవారత్న అవార్డుకు ఎంపికైనట్లు తెలియడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో జేకే ట్రస్ట్ చేసే సేవలు మండల చరిత్రలో కీలక పాత్ర పోషించాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. విద్య, వైద్యం ద్వారానే బడుగు బలహీన వర్గాల జీవితాలలో మార్పు వస్తుందని ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించగలరని నర్సరీ నుంచి డిగ్రీ కళాశాలతో పాటు ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారు. ఈ విషయాలపై గత రెండు సంవత్సరాలుగా సర్వే నిర్వహించి 2026 సంవత్సరానికి గానూ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు నల్ల రాధాకృష్ణ తెలిపారు. జూలై 26న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డు అందజేస్తారని స్పష్టం చేశారు. ఈ అవార్డు ద్వారా తమకు బాధ్యతలు ఇంకా పెరిగాయని సర్పంచ్ దంపతులు తెలిపారు. తనకు సేవారత్న అవార్డుకు ఎంపిక చేసిన బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



