నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాజీ హిమ్మత్ లాల్ టెలిఫోన్ బీడీ కార్మికులకు నాణ్యమైన మంచి తునికి ఆకు ఇవ్వాలని సకాలంలో వేతనాలు అందించాలని బీడీ యాజమాన్యానికి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఏడు లక్షల మంది బీడీ కార్మికులకు సరైన ఉపాధి అందక జీవనం కొనసాగిస్తున్నారని, అదే క్రమంలో బీడీ యాజమాన్యం నాసిరకం తునికకును అందిస్తూ వారి శ్రమని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కార్మిక శాఖ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆకు తక్కువ వెయ్యడం వలన బీడీ కార్మికులు బయట నుండి ఆకులు కొనుగోలు చేసి బీడీ యాజమాన్యానికి భర్తీ చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇదే క్రమంలో అనేకసార్లు యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులచే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మురళి, టేకేదార్లు గంగాధర్, నారాయణ, శ్రీహరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు