ఉక్రెయిన్‌లో ఓడరేవు లక్ష్యంగా రష్యా డ్రోన్ల దాడి

russian-drone-attack-targets-port-in-ukraineనవతెలంగాణ – ఉక్రెయిన్‌
ఉక్రెయిన్‌లోని ఓడ రేవు, ధాన్యం ఎగుమతులు లక్ష్యంగా రష్యా డ్రోన్లతో దాడి చేసింది. బుధవారం ఉదయం ఉక్రెయిన్‌ తీరప్రాంతంలోని ఒడెసా నగరానికి దక్షిణంగా ఉన్న ఓడ రేవుతోపాటు ధాన్యం నిల్వ కేంద్రాలపై రష్యా డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ధాన్యం నిల్వలు మంటల్లో చిక్కుకున్నట్లు ఆ ప్రాంత గవర్నర్‌ ఒలేహ్‌ కీపర్‌ తెలిపారు. నల్ల సముద్రం మీదుగా అంతర్జాతీయ మార్కెట్‌కు ఆహార ధాన్యాల ఎగుమతుల విషయంలో ఉక్రెయిన్‌, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందం పొడిగింపు నుంచి కొద్ది రోజుల క్రితం రష్యా బయటికొచ్చింది. అప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని వ్యవసాయ, మౌలిక వసతులు లక్ష్యంగా రష్యా దాడులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజా డ్రోన్‌ దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. బుధవారం ఉదయం నల్ల సముద్రం మీదుగా వచ్చిన డ్రోన్లు డాన్‌బే నది తీరం వెంబడి ఇజ్మాయేల్‌ వైపు వెళ్లినట్లు ఉక్రెయిన్‌ మీడియా తెలిపింది. ప్రస్తుతం ఈ ఓడరేవు నుంచే రొమేనియాలోని నల్ల సముద్రం తీరంలో ఉన్న కాన్‌స్టాన్‌టా నగరానికి ఉక్రెయిన్‌ ధాన్యాన్ని తరలిస్తుంది. రష్యా ధాన్యం ఎగుమతుల ఒప్పందం నుంచి బయటికి వచ్చిన నేపథ్యంలో ధాన్యం రవాణా చేసే పలు విదేశీ ఓడలు ఆదివారం నల్ల సముద్రం గుండా ఇజ్మాయేల్ పోర్టుకు చేరుకున్నాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. ఈ క్రమంలో రష్యా దాడులు చేసి వాటిని అడ్డుకోవాలని చూస్తుందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. గత కొద్ది రోజులుగా మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడులకు పాల్పడుతోంది. ఆదివారం ఉదయం మాస్కో విమానాశ్రయంపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు ఆఫీస్‌ టవర్లు దెబ్బతిన్నట్లు రష్యా పేర్కొంది. మరోసారి మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి చేసింది. అయితే, ఈ దాడిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రష్యా ప్రకటించింది.

Spread the love