నవతెలంగాణ – నిజమాబాద్: కూల్ డ్రింక్ అప్పు ఇవ్వలేదని షాప్ యజమానిపై దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీలో సాగర్ కిరాణా షాప్ నడుపుతున్నాడు. షాప్‌కు వచ్చిన శేఖర్, సాగర్ తో మాటలు కలిపాడు. కూల్ డ్రింక్ ఇవ్వాలని కోరాడు. సరే అంటూ కూల్ డ్రింక్ తీసుకునే క్రమంలో తనకు అప్పుగా ఇవ్వాలని కోరాడు శేఖర్. దీని సాగర్ అప్పు ఇవ్వనని డబ్బులు ఉంటే ఇచ్చి తీసుకోవాలని కోరారు. అయితే తన దగ్గర డబ్బులు లేవని తిరిగి మళ్లీ ఇస్తానని చెప్పాడు శేఖర్. దీనికి సాగర్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్రంగా కోప్పడ్డాడు. డబ్బులు ఇవ్వకుండా పారిపోతామా కూల్ డ్రింక్ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే దానికి నువ్వు ఎంత కోప్పడినా కూల్ డ్రింక్ అప్పుగా ఇచ్చేదే లేదని ఖరాఖండిగ చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊడిపోయిన శేఖర్.. షాప్ యజమాని సాగర్ పై పక్కనే ఉన్న కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. శేఖర్ దాడిని గమనించిన సాగర్ కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన శేఖర్ వెనుకాడలేదు.. వారిపై కూడా కత్తితో దాడికి దిగాడు. దీంతో సాగర్ కు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శేఖర్ ను పట్టుకోవడంతో షాప్ యజమాని సాగర్, వారి కుటుంబ సభ్యులు లోనికి వెళ్లారు. దీంతో ఇదే అలుసుగా భావించిన శేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. షాప్ యజమాని సాగర్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.