ఆయిల్ ఫాం – మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయిల్ఫెడ్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు జోగేశ్వరరావు
– వినతి పత్రం అందజేసిన ఆయిల్ ఫాం గ్రోవర్స్ సొసైటీ బృందం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగులో రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్ధిక, సంస్థాపరం అయిన ఒడిదుడుకులను, ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డిని ఆయిల్ఫెడ్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులు రావు జోగేశ్వరరావు నేతృత్వంలో ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఫాం ఆయిల్ గ్రోవర్స్ సొసైటీ బాధ్యులు తుంబూరు మహేశ్వర రెడ్డి,కొక్కెరపాటి పుల్లయ్యలు కోరారు. టిఎస్ ఆయిల్ఫెడ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా నూతనంగా ఎంపికైన రావు జోగేశ్వరరావు శుక్రవారం హైద్రాబాద్ లోని సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి కృతఙ్ఞతలు తెలిపారు.
అనంతరం మంత్రి తో కొద్ది సమయం సమావేశం అయి ఆయిల్ ఫాం సాగు,విస్తరణ,ప్రభుత్వం ప్రోత్సాహం,గెలలు కు గిట్టుబాటు ధర, మొక్కలు మంజూరికి సంస్థ విధివిధానాలు, నర్సరీ నిర్వహణ, మొక్కలు పెంపకం, చావు మొక్కలు అందజేత, సాగు పర్యవేక్షణ, సేంద్రీయ వ్యవసాయ యాజమాన్యం, యాంత్రీకరణ ఆవశ్యకత, ఎఫ్ – కోడ్ జారీ విధానం, కౌలు రైతుల ప్రాధాన్యత, గెలలు రవాణా చార్జీలు లాంటి అనేక అంశాలను వినతి పత్రం రూపంలో ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి సొసైటీ అధ్యక్షులు నడిపల్లి నవీన్ కుమార్ పాల్గొన్నారు.