సిప్లిగంజ్‌ పాట.. కళాకారుల ఆట!

– జోరుగా సిఎం కప్‌ ఆరంభోత్సవ ఏర్పాట్లు
– సమీక్ష సమావేశంలో శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌

సిఎం కప్‌ 2023 రాష్ట్ర స్థాయి పోటీలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 28-31 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనుండగా.. 29న ఆరంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం జరుగనున్న ఆరంభోత్సవానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆస్కార్‌ వేదికపై అలరించిన గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నాటు నాటు పాటతో హోరెత్తించనుండగా.. సంప్రదాయ కళాకారులు నృత్య ప్రదర్శనలతో దుమ్ములేపనున్నారు. ఈ మేరకు ఆరంభోత్సవ కార్యక్రమం గుర్తుండిపోయే ఎంటర్‌టైనర్‌గా నిలిచేందుకు శాట్స్‌ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. సిఎం కప్‌ రాష్ట్ర స్థాయిలో 18 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా, సుమారు 10000 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. ఈ పోటీలకు వేదికలుగా 6 మైదానాలను శాట్స్‌ ఖారారు చేసింది. కోట్ల విజరు భాస్కర్‌ రెడ్డి స్టేడియం (యూసుఫ్‌గూడ), సరూర్‌ నగర్‌ స్టేడియం, ఎల్‌బి స్టేడియం, జింఖానా గ్రౌండ్స్‌, జిఎంసీ బాలయోగి స్టేడియం (గచ్చిబౌలి), షూటింగ్‌ రేంజ్‌ (హెచ్‌సీయూ, గచ్చిబౌలి) సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పది వేల మంది క్రీడాకారులు బస చేసేందుకు సైతం శాట్స్‌ యంత్రాంగం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది.
‘తెలంగాణ రాష్ట్రంలో సిఎం కప్‌ పోటీలు తొలిసారి జరుగుతున్నాయి. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేదు. క్రీడాకారులు ఆహ్లాదకర వాతావరణంలో పోటీపడి తిరిగి ఇంటికి చేరుకునే వరకు వారి బాధ్యత మనదే. పోలీసు, తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన వసతి, వైద్య ఆరోగ్యం, రవాణా కమిటీలు సమన్వయంతో పని చేయాలి. క్రీడలు జరిగే ఆరు వేదికల బాధ్యులు అన్ని సమయాల్లోనూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి. ఇందులో ఎటువంటి రాజీ లేదు’ అని శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. సమావేశంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియ, శాట్స్‌ ఉన్నతాధికారులు, నిర్వహణ కమిటీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love