హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌ చేయాలి

Smart work should be done rather than hard workఐఏఎస్‌, ఐపీఎస్‌ కావాలని అందరూ కలలు కంటారు… కానీ ఆ కలని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. ఇలా తన కలను నిజం చేసుకుంది పాలమూరు ఆడబిడ్డ దోనూరు అనన్య రెడ్డి. సివిల్‌ సర్విసెస్‌ 2023 ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించింది. ఎలాంటి కోచింగ్‌ లేకుండా సొంతంగా ప్రిపేర్‌ అయి మొదటి ప్రయత్నంలోనే ఇంత గొప్ప ర్యాంక్‌ తెచ్చుకొని యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆమెతో మానవి సంభాషణ…
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి…
అడ్డాకుల మండలం, పొన్నకల్‌ గ్రామం, మహబూబ్‌నగర్‌ జిల్లా మాది. చిన్నతనమంతా అక్కడే గడిచింది. స్కూలింగ్‌ కూడా అక్కడే. పదో తరగతి మాత్రం గీతమ్‌ హైస్కూల్లో పూర్తి చేశాను. నాన్న సురేష్‌ రెడ్డి, ఊళ్ళో వ్యవసాయం చేయిస్తూ, సొంతంగా వ్యాపారం కూడా చేస్తారు. అమ్మ మంజుల, గృహిణి. నాకు ఓ చెల్లెలు వుంది. తన పేరు చరణ, ఇంటర్‌ చదువుతుంది. కలక్టర్‌ అయితే ప్రజలకు సేవ చేయొచ్చని నా చిన్నతనంలో మా తాతయ్య ఎప్పుడూ అంటుండేవారు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. అంతే కాక మొదటి నుండి ఆర్ట్స్‌ కోర్సులంటే బాగా ఇష్టం. అందుకే పదో తరగతి తర్వాత ఇంటర్‌లో ఆర్ట్స్‌ తీసుకున్నా. హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్‌ నా సబ్జెక్ట్‌.
అందరూ ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ అంటున్న రోజుల్లో మీరు ఈ కోర్సు తీసుకుంటే ఇంట్లో ఏమీ అనలేదా?
ఒకసారి ఆలోచించుకో అన్నారు. అయితే చిన్నప్పటి నుండి అన్ని సబ్జెక్ట్స్‌లో బెస్ట్‌గా ఉండేదాన్ని. అయితే నా ఇష్టాన్ని ఇంట్లో వాళ్ళు కాదనలేదు. కాబట్టి ఈ కోర్సు తీసుకున్నాను. ఇంటర్‌ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్‌లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశాను. అయితే అప్పటి వరకు సివిల్స్‌ రాయాలా వద్దా అనేది కచ్చితంగా నిర్ణయించుకోలేదు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ అప్పుడు సివిల్స్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టాను. ఇంటర్‌లో ఉన్నప్పుడే సివిల్స్‌ గురించి కొన్ని బేసిక్స్‌ నేర్పించారు. సివిల్స్‌కి ప్రిపేర్‌ కావాలి అనుకున్నపన్పుడు ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. రెండేండ్లు దీనిపై కూర్చున్నాను. సెలక్ట్‌ అవుతానని అనుకున్నాను కానీ మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు.
మీ ప్రిపరేషన్‌ ఎలా సాగింది..?
ఇంటర్‌ నుండే పేపర్‌ చదవడం అలవాటయింది. డిగ్రీకి వెళ్ళిన తర్వాత కరెంట్‌ అఫైర్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేదాన్ని. అలాగే క్లాస్‌ పుస్తకాలతో పాటు ఫిక్షన్‌, నాన్‌ఫిక్షన్‌ బుక్స్‌ బాగా చదువుతుండేదాన్ని. దాంతో చదివే అలవాటు పెరిగింది. మూడు రోజులకు ఒక బుక్‌ పూర్తి చేసేదాన్ని. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు కరోనా రావడంతో ఢిల్లీ నుండి ఇంటికి వచ్చేశాను. అప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు జరిగేవి. 2021లో నా అసలు ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ ఉన్నప్పుడు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్‌కు మూడు నెలలు ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకున్నాను. కానీ ఫుల్‌ టైం ప్రిపరేషన్‌ మాత్రం జూన్‌ 2021 నుండి మొదలుపెట్టాను.
మొదటి సారే మూడో ర్యాంక్‌… ఎలా సాధ్యమయిందను కుంటున్నారు?
మొదట నేను ఈ ఎగ్జామ్స్‌ గురించి బాగా విశ్లేషణ చేశాను. ఏడాదిన్నర దీని కోసం కేటాయిస్తే సరిపోతుందనిపించింది. అయితే ఎంత టైం కేటాయిస్తున్నాం అనేది కాదు ఎంత క్వాలిటీ టైం కేటాయిస్తున్నామనేది దీనిలో ముఖ్యం. ప్రిలిమ్స్‌కి ప్రిపేరయ్యేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్‌ నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, దానికి తగ్గట్టు నోట్స్‌ ఎలా తయారు చేసుకోవాలి, ప్రాక్టీస్‌ ఎలా చేయాలి, ఎగ్జామ్‌ హాల్లో టెన్షన్‌ లేకుండా రాయాలంటే ఎలా ప్రిపేరవ్వాలి వీటిపై దృష్టి పెట్టాను. అలాగే మెయిన్స్‌కి కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో టాప్‌ ర్యాంకర్లు వచ్చిన వారు ఎలా రాశారు, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడారు ఇలాంటి వీడియోలు బాగా చూసేదాన్ని. చదవడంతో పాటు వాటి విశ్లేషణకు టైం బాగా కేటాయించేదాన్ని. ఈ విశ్లేషణ నాకు ప్లెస్‌ పాయింట్‌ అయిందనుకోవచ్చు. గత టాపర్స్‌ నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే ఒకరు చెప్పింది విని దాన్ని ఫాలో అవ్వడం కాదు. మన ప్లానింగ్‌ మనకు తగినట్టు ఉండాలి. మరో విషయం బ్లయిండ్‌గా వెళ్ళొదు. అంటే ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నామంటే దాని నుండి మనం ఏం నేర్చుకున్నామో ఓ స్పష్టత ఉండాలి. ఏదో చదివామంటే చదివామని కాదు. ప్రతి దాంట్లో మనకు ఉపయోగపడే అంశం ఏముందో దాన్ని అవగాహన చేసుకుంటే అప్పుడు చదివినా, రాసినా ఫలితం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పని చేసినా సూక్ష్మంగా ఆలోచించాలి.
పోస్టింగ్‌ వచ్చిన తర్వాత మీ పని ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
మాకు ఇచ్చే జిల్లాను బట్టి అక్కడ అవరాలు, పరిస్థితులను బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. అయితే మొత్తంగా చూసినప్పుడు ప్రజలకు అర్థమయ్యే పాలన అందించాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది అధికారులు, పోలీసులను కలవాలంటే భయపడుతున్నారు. అలాంటి ఫీలింగ్‌ పోగొట్టాలి. అప్పుడు వారి సమస్యలను పరిష్కరించగలుగుతాం. మా పని కూడా సక్రమంగా చేశామనే తృప్తి ఉంటుంది. ఏ పని చేసినా ప్రజలు కేంద్రంగా ఉండాలి. అలాగే విద్యపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరం. ఒక ఇంట్లో ఒక జనరేషన్‌ చదువుకుని ఉంటే వారు ఆలోచించే విధానం, జీవన పద్ధతి మారిపోతుంది. కాబట్టి విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను.
మీ హాబీలు..?
క్రికేట్‌ బాగా చూస్తాను. ఎంత ఇష్టమంటే టెస్ట్‌ మ్యాచ్‌లు కూడా వదలకుండా చూస్తాను. అయితే చూసి వదిలేయను, క్వీన్‌గా విశ్లేషణ చేస్తాను. ఎగ్జామ్స్‌ టైంలో మాత్రం కాస్త తగ్గించాను. అలాగే నవలలు బాగా చదువుతాను. డిగ్రీ చదివేటప్పుడైతే మూడు రోజులకు ఒక బుక్‌ పూర్తి చేసేదాన్ని. ప్రిపేరేషన్‌ అప్పుడు కాస్త తగ్గింది. మళ్ళీ మొదలుపెడతాను. అలాగే మ్యూజిక్‌ కూడా బాగా వింటాను.
మూడో ర్యాంక్‌ సాధించారు ఎలా ఫీలవుతున్నారు..?
చాలా హ్యాపీగా ఉంది. నేనే కాదు మా ఇంట్లో, ఊళ్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మహబూబ్‌నగర్‌ అంటే ఇప్పటికీ వెనకబడిన జిల్లానే. విద్యలో, అందునా మహిళా విద్యలో వెనకబడి ఉంది. ఇప్పుడు నాపై బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. ర్యాంక్‌ వచ్చింది సరే అది సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేదే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యాలు.
సివిల్స్‌కి ప్రిపేరయ్యే వారికి మీరిచ్చే సూచనలు..?
డిగ్రీలో ఉన్నప్పుడే చదవడం, రాయడం మొదలుపెట్టాలి. ముఖ్యంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. పరీక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. హార్డ్‌ వర్క్‌ కంటే స్మార్ట్‌ వర్క్‌ చేయాలి. ఈ ఎగ్జామ్‌ ఓ లాంగ్‌ జర్మీ లాంటిది. ప్రిపేరయ్యేటప్పుడు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి. అయితే దీన్ని మనం ఎందుకు ఎంపిక చేసుకున్నాం అనే విషయంలో ఓ స్పష్టత వుంటే కచ్చితంగా సాధిస్తాం. ఒక్కసారి ఫెయిల్‌ అయినా కుంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరీక్షల్లో అది చాలా సహజం. మరింత పట్టుదలతో ప్రిపేర్‌ అవ్వాలి.
అమ్మాయిల అభివృద్ధికి మీరిచ్చే సూచన..?
చదువు చాలా అవసరం. ఆ చదువు వల్లనే మనపై కాన్ఫిడెన్స్‌ వస్తుంది. ఒకరిపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మేమూ ఎందులోనూ తక్కువకాదు, ఏమైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. అప్పుడు ఎవరికీ భయపకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయి. అయితే మన ముందు ఎంతో మంది స్ఫూర్తిదాయక మహిళలు ఉన్నారు. వారి జీవితాలను చూసి మన స్థాయిలో మనం ఏం చేయగలమో ఆలోచించాలి. అప్పుడు అమ్మాయిల కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ : సలీమ 

Spread the love