చమత్కారం చాలించిన శ్రీరమణ

ఆయన పేరు విషయంలోనే చమత్కారం జరి గింది. ఆయనకు మూడు బారసాలలు అయి ఉండాలి. సెప్టెంబర్‌ 21, 1952న గుంటూరు జిల్లా వేమూరు మండలంలో ఉన్న వరాహపురం అగ్రహారంలో జన్మిం చిన వీరికి మొదటి బారసాలలో పేరు పెట్టిన కన్న తల్లిదండ్రులు వంకమామిడి అనసూయ, సుబ్బారావులు. ఆయనకు పెట్టిన పేరు ‘వంకమామిడి రాధాకష్ణ’. తండ్రి సుబ్బారావు గ్రామకరణం, కంపోస్ట్‌ మాస్టర్‌. అయితే రాధాకష్ణ తాతకి గుడిపాటి వెంకటచలం తాతకి పోలిక. ఇద్దరికీ వారసులు లేరు. (చలంని వారి తాత దత్తత తీసుకుని కొమ్మూరి వెంకటచలాన్ని కాస్తా గుడిపాటి వెంకటచలం చేసారు) అలాగే ఈ వంక మామిడి రాధాకష్ణని వారి తాత దత్తత తీసుకున్నారు. అప్పుడు రెండో బారసాల జరిగి ఆయనకు రెండో పేరు పెట్టారు. ఆ రెండో పేరు ‘కామరాజు రామారావు’. దత్తత నాటికి పెద్దవాడై ఉంటాడు కాబట్టి ఈసారి బారసాల అది చేసినా ఉయ్యాలలో వేసి ఉండరు. వేసినా ఉయ్యాల సరిపోదు. కాళ్ళు బయటికి వస్తాయి. ఆయన అసలే పొడగరి మరి. తల్లితండ్రులు, తాత పేరు పెట్టగా లేనిది నాకు నేనే పేరు పెట్టుకోలేనా అనుకున్నారో ఏమో? ‘శ్రీరమణ’ అని ఆయనకు ఆయనే పేరెట్టుకున్నారు. ఆనాటికే ముళ్ళపూడి వెంకటరమణ అని సుప్రసిద్ధ రచయిత ఉండనే ఉన్నాడాయే. ఆయనకు పోటీ ఎందుకు? అనుకున్నట్టు ఉన్నారు. ‘శ్రీరమణ’ అని సింపుల్‌గా మార్చుకున్నారు. ఇందులోనూ లౌక్యం చూపారు. పేరుకు ముందు ‘శ్రీ’ అని తగిలించి. ఇంకొకడు గౌరవించే దాకా ఎదురు చూడటం ఎందుకు? మనకు మనమే ఆపాటి గౌరవం ఇచ్చుకోలేమా? అనుకున్నారు! అయితే కొందరు గౌరవం కొద్దిగా ‘శ్రీ శ్రీరమణ’ అని అంటే… ”ఎందుకు లేండి రెండు శ్రీ లు? ‘నాకు నేనొకటి తగిలించుకున్నాను. మీరెందుకు రెండు తగిలిస్తారు?’ రెండు శ్రీ లున్నాయన ఈ శతాబ్దం నాది అన్నాడు. శ్రీశ్రీ రమణ అని మీరంటే కనీసం అర్థ శతాబ్దమైన అడగాలి కదా! ఎందుకు వచ్చిన దురాశ” అని చమత్కరించేవారు.
నవ్వు నాలుగు విధాల రైటు అనేది ఆయన విధానం. ఆయన నినాదం. అందు కని ఆయన చాలా చిన్న వయసులోనే చదువు సంధ్యలు వెలిగిస్తూనే పేరడీలు పలికించారు, హాస్యజ్యోతులు కూడా వెలిగించారు. ఆయన తొలిసారి పేరడీ రచన చేసి నండూరి రామ్మో హనరావు ఎడిటర్‌గా ఉన్న ఆంధ్రజ్యోతికి పంపిస్తే, అది చదివిన నండూరి ”డాజిల్‌ అయిపోయా”రట.
అప్పటిదాకా పేరడీ అంటే జరుక్‌ శాస్త్రి (అదే జల సూత్రం రుక్మినాథ శాస్త్రీ), మాచిరాజు దేవి ప్రసాదులే. ‘వారిని మించిన ఘణుడులా ఉన్నాడు ఇతగాడెవడో’ అని నండూరి వారి చేతే అనిపించుకున్న పేరడీ గండర గండుడు శ్రీరమణ. ఒకచోట నండూరి వారే అన్నారు.
”సటైరులకు రెడీ రెడీ
స్వతైరులకు ఫెడి ఫెడి
శ్రీరమణ ప్రతి పేరడీ
చిత్రోక్తుల గారడి” అని.
ఎంకి పాటలు నండూరి సుబ్బా రావు ”గుండె గొంతుకలోన కొట్లాడుతాది…” అని ప్రియు రాలు ఎంకి గురించి అంటే, ”గుండు’ గొంతులోన కొట్లాడు తాది” అని గోలి సోడా గురించి ‘కిస్సు’మనేలా పేరడీ పేల్చారు శ్రీరమణ.
అదొక్కటేనా? అబ్బో చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఆయన పేరడీ చమక్కులు. అలా తొలి రచనతోనే నండూరి రామ్మోహనరావు వారు శ్రీరమణకి పాత్రికేయ ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తూ ”ఏం రాస్తావు?” అని ఆయనంటే, ”కాలమ్‌ రాస్తా” అని ఈయనన్నారు. అది… ఇది… రాసి, రాసి… చేతులు కాయలు కాసి, అనుభవం తోడేసి, అనుభవంతుడైన తరువాతే ‘కాలమ్‌’ రాసే కాలం వస్తుంది సామాన్యంగా ఎవరికైనా. అట్లాంటిది జర్నలిజం పసికూన శ్రీరమణ కాలమ్‌ రాస్తాననగానే ”సర్లే నువ్వా?” అనలేదాయన ”సర్లే నువ్వే!” అన్నారు. తాజాగా ఆయన రాసిన పేరడీ గుర్తొచ్చి సన్నగా నవ్వుతూ.
అలా కాలమ్‌ రాయడంతో మొదలైన ఆయన కలం కాలక్షేపంగా చమత్కారపు సువాసనలను సిరాగా నింపుకుని తెలుగు పలుకుబడి తో పరుగు లెట్టింది. ఆయనకు ఏదైనా పదం తెలుగుతనంతో కావాల్సి వచ్చినప్పుడు సొంత అన్నయ్య వంకమామిడి పార్ధసారధికి కాల్‌ చేసి తెలుసుకుని రాసేవారట. అన్నట్టు శ్రీరమణ ధర్మపత్ని జానకి. తన వదిన సొంత చెల్లెలే.
కొంతకాలం ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేసిన తర్వాత ముళ్ళపూడి వెంకట రమణ పిలుపుమేరకు మద్రాసు పైనమయ్యారు. ‘చిత్రకల్పన’ సంస్థ ముళ్ళపూడి వారు కాగితాల మీద రాస్తుంటే… బాపు దాన్ని రీళ్ల మీద సినిమాగా తీస్తుంటే… శ్రీరమణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా సుతిమెత్తని పెత్తనం చెలాయించారు. అలా త్యాగయ్య, మిస్టర్‌ పెళ్ళాం, పెళ్లి పుస్తకం… సినిమాలతో పాటు ఈ ఏడు శతజయంతి జరుపుకున్న ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లల కోసం బాపు-రమణలతో చేయించిన, తీయించిన వీడియో పాఠాలు, ఈటీవీ వారి భాగవతం వరకు వీరి ముగ్గురి బాగోతం మూడు పువ్వులు ముప్పైఆరు నవ్వులుగా సాగింది. ఆంధ్రజ్యోతి పునః ప్రారంభమైనప్పుడు నవ్య వీక్లీకి సంపాదకుడిగా మళ్లీ మొగ్గ తొడిగారు. వీక్లీ పరిమళాన్ని నాలుగు దిశలా వ్యాపింప చేశాక మహా టీవీ, అటు నుండి భక్తి టీవీకి వెళ్లారు. ‘పత్రిక’ అనే పత్రికకు గౌరవ సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. నండూరి వారి దగ్గర మొదలై మొన్న 19 జూలై 2023 న వారు కాలం చేసే వరకు ఆయన కలం పరుగులెత్తుతూనే ఉంది. వారి రచనలు చదివుతున్న పాఠకుడి పెదవుల మీదకి హాస్యాన్ని వంపుతూనే ఉంది.
శ్రీరమణ పేరడీలు రాశారు. చమత్కారాలు రాశారు. ప్రముఖుల ప్రేమలేఖలు (పేరడీగా) రాశారు. కోనంగి రాతలు రాశారు. శ్రీచానల్‌ నిర్వహించారు. హాస్య జ్యోతుల్లో ‘నవ్వుల నూనె’ పోసారు. రంగుల రాట్నం తిప్పారు. మానవ సంబంధాల్లో నవ్వులు నింపారు. ఒకటా రెండా ఎన్నెన్నో శీర్షికలతో ఆయన త్రివిక్రముడిలా చెలరేగిపోయారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ వారి కోరిక మీద ”ప్రేమ పల్లకి” నవల రాశారు. అప్పటివరకు ఒకరికి ఇంకొకరు తెలియని యువతీ యువకులు పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుని దంపతులుగా మారతారు. ఆ దంపతులు తాము భార్యా భర్తలమన్న విషయం పక్కన పెట్టి ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అనే థీం తో ప్రేమపల్లకి నవల రాసారు. నవ దంపతులయిన గీత, రాంపండుల చిలిపి శంగారాన్ని, కోపతాపాల్ని ముగ్ద మనోహరంగా నవల మొత్తం నింపారు. నేను పదేండ్ల తేడాతో ప్రేమపల్లకి రెండు సార్లు చదివాను. ఎంత హాయిగా ఉంటుందో! మీరింకా ఈ నవల చదవలేదా? ప్చ్‌… దురదష్టవంతులు. గంగిగోవు పాల చందంగా ఆయన రాసిన ఒకే ఒక్క నవల ఇది. ”రంగుల రామచిలక” అనే మరో నవల సీరియల్‌గా వస్తున్నట్టు అదే ఆంద్రజ్యోతిలో ప్రకటన వెలువడింది కానీ సీరియల్‌ మాత్రం రాలేదు. పెన్ను పంజరంలోనే ఉండిపోయింది ఆ రామచిలుక.
ఆయన గొప్ప కథకుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రపంచం మొత్తం మెచ్చిన ‘మిథునం’తోపాటు బంగారు మురుగు, ధనలక్ష్మి, షోడా నాయుడు, అరటి పువ్వు సాములోరు, నాలుగో ఎకరం… వంటి మేలిమి కథలు రాశారు.
ఆయనను పెద్ద పెద్ద సంస్థలు ఏవీ పిలిచి పురస్కారాలు ఇవ్వలేదు. ఆయన చేతులు చాచింది లేదు. తెలుగున పత్రికలని నెత్తిన పెట్టుకుని ఊరేగిన ఆ స్వర్ణయుగం నుండి మొన్నమొన్నటి వరకు రచయిత/త్రులందరూ ‘తమ రచనకి బాపు బొమ్మలెయ్యడం పెద్ద గౌరవంగా’ చెప్పుకునేవారు. ఒక్కోసారి ఆయనే ‘నేను రెమ్యూనరేషన్‌ తీసుకునేది కథకు బొమ్మ వేసినందుకు కాదు. ఆ కథను చదివినందుకు’ అని కొన్ని కొన్ని కథల విషయంలో అనే వారట. అలాంటి బాపు ‘మిథునం’ కథ చదివిన తర్వాత ఆ కథను ప్రతిబింబించే బొమ్మ వేయలేనేమో? ఒకవేళ వేసినా… కథ జీవాన్ని ఆ బొమ్మ లోకి తీసుకు రాలేమేమో? నని, భక్తి కొద్ది ఆ కథను తన చేతిరాతతో రాసి గౌరవించారు. బాపూ జీవితంలో ఇలా ఒక కథను తన చేతిరాతతో మొదటి నుండి చివరి వరకు రాయడం మిథునం విషయంలోనే జరిగింది. మిథునమే మొదటిది, చివరిది అట. ఇంతకంటే గొప్ప గౌరవం, గొప్ప డాక్టరేట్‌, మహోన్నత పురస్కారం ఇంకేముంటుంది! రచన శాయి బాపు చేతి రాతతో ఉన్న మిథునాన్ని పుస్తకం గా అచ్చేసి బాపు, శ్రీరమణలతో పాటు తెలుగు కథను గౌరవించారు.
మిథునం కథ కన్నడంలోకి అనువదించబడిన తర్వాత నాటకీకరణ కూడా జరిగింది. ఈ రోజుకి ఏదో ఒక ప్రాంతంలో ప్రదర్శింపబడుతూనే ఉందని కన్నడ రచయిత వసుదేంద్ర చెప్పారు. ప్రసిద్ధ మలయాళ దర్శకుడు యం.టి. వాసుదేవన్‌ నాయర్‌ ఈ కథను మలయాళంలో సినిమాగా తీసి జాతీయ బహుమతిని పొందారు. తెలుగులో మిథునాన్ని తనికెళ్ళ భరణి తన దర్శకత్వంలో యస్‌.పి.బాలు, లక్ష్మి రెండే పాత్రలతో ఒక గొప్ప కథను సినిమాగా తెలుగువారికి అందించారు.
నేడు మన మధ్య శ్రీరమణ లేకపోయినా ఆయన మన మీద చల్లి వెళ్లిన హాస్యపు పరిమళం ఈ జన్మకంటూ పోదు. శ్రీరమణ తెలుగు సాహిత్యపు వాతావరణాన్ని, సినిమా రంగాన్ని, అలాగే రాజకీయాలను దగ్గరగా చూసి, ఆ రాజకీయాలకు దూరంగా ఉన్న రచయిత. శ్రీరమణని మరిపించేలా పేరడీలు, కాలమ్స్‌, కథలు, కబుర్లు చెప్పే ఇంకో శ్రీరమణ మునుముందుకు వస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే ఒకేఒక్క మిథునం. ఒకే ఒక్క శ్రీరమణ.

Spread the love