సూపర్‌ హైదరాబాదీ

Super Hyderabadi– సత్తా చాటిన సిరాజ్‌
మియాభారు మెరుపుల్‌. టెస్టు బౌలర్‌గా జాతీయ జట్టులోకి వచ్చిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో పెద్దగా చెప్పుకోదగిన గణాంకాలు లేవు. అయినా, ఇటీవల కాలంలో కండ్లుచెదిరే బౌలింగ్‌తో మెరుస్తున్న మహ్మద్‌ సిరాజ్‌ అదరగొడుతున్నాడు. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ ముంగిట, మహ్మద్‌ సిరాజ్‌ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. ఆసియా కప్‌ ఫైనల్‌ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలతో పాటు కెరీర్‌ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. వర్షంతో 40 నిమిషాలు ఆలస్యంగా ఆరంభమైన 50 ఓవర్ల మ్యాచ్‌.. మహ్మద్‌ సిరాజ్‌ సింహనాదంతో 50 పరుగుల మ్యాచ్‌గా మార్చివేశాడు.
తొమ్మిది రోజుల వ్యవధిలో ఆరు మ్యాచులు జరిగిన పిచ్‌పై మహ్మద్‌ సిరాజ్‌ రాబట్టిన స్వింగ్‌ అమోఘం. మ్యాచ్‌ ఆరంభానికి ముందు పడిన కాసిన్ని చిరు జల్లులను గొప్పగా సద్వినియోగం చేసుకున్న సిరాజ్‌..తన తొలి ఓవర్‌ నుంచే గణనీయ స్వింగ్‌ సాధించాడు. తను సంధించిన రెండో ఓవర్లో సిరాజ్‌ ఏకంగా సంచలనమే సృష్టించాడు. ఒకే ఓవర్లో ఏకంగా నలుగురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇది నాల్గో సందర్భం. గతంలో బంగ్లాదేశ్‌పై చమిందా వాస్‌ (2003), న్యూజిలాండ్‌పై మహ్మద్‌ షమి (2009), వెస్టిండీస్‌పై ఆదిల్‌ రషీద్‌ (2019) ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇప్పుడు మహ్మద్‌ సిరాజ్‌ ఆ జాబితాలోకి చేరాడు. కచ్చితమైన లెంగ్త్‌, లైన్‌తో బంతులు సంధించిన మహ్మద్‌ సిరాజ్‌.. అంచనాలకు మించి స్వింగ్‌ రాబట్టాడు. దీంతో సిరాజ్‌ స్వింగ్‌ను శ్రీలంక బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోయారు. తొలి వికెట్‌కు రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ అద్భుతంతో సొంతం చేసుకున్న సిరాజ్‌.. ఆ తర్వాత ఐదు వికెట్లను సైతం అలవోకగా అందుకున్నాడు.
సిరాజ్‌ బంతులను ఆడేందుకు శ్రీలంక బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. ఇన్‌ స్వింగ్‌, అవుట్‌ స్వింగ్‌తో నిప్పులు చెరిగిన సిరాజ్‌ శ్రీలంక ఇన్నింగ్స్‌ను కకావికలం చేశాడు. పది బంతుల వ్యవధిలోనే ఐదు వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ సిరాజ్‌ ఏడు ఓవర్లలో 21 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. 2022 నుంచి వన్డేల్లో పవర్‌ప్లేలో 32 వికెట్లు పడగొట్టిన మహ్మద్‌ సిరాజ్‌.. ఈ సమయంలో కొత్త బంతితో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ వేటకు సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియాకు కొత్త బంతితో మహ్మద్‌ సిరాజ్‌ సంచలన ప్రదర్శనలు సరికొత్త ఉత్సాహం అందిస్తున్నాయి.

Spread the love