రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు సుప్రీం కోర్ట్‌ భారీ షాక్‌!

నవతెలంగాణ – హైదరాబాద్
రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు సుప్రీం కోర్ట్‌ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద‍్విచక్రవాహనాలు నడపకూడదంటూ తీర్పిచ్చింది. జూన్ 30 నాటికి టూవీలర్‌ నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్‌ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్‌ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్‌ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్‌  లైసెన్స్‌ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్‌ షేరింగ్‌ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్‌ షేరింగ్‌ టూ వీలర్‌ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్‌ షేరింగ్‌ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది.

Spread the love