రేపు 2 గంటల్లోగా వీవీ ప్యాట్‌ లపై స్పష్టత ఇవ్వండి : ఈసీకి సుప్రీం ఆదేశం

నవతెలంగాణ – ఢిల్లీ : ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే విచారణకు ఈసీ తరఫు ప్రతినిధి హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని తెలిపింది. ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను ఓటర్లు సంపూర్ణంగా ధ్రువీకరించుకొనేలా ఈసీ మార్చాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఒకవేళ అలా కుదరకుంటే గతంలో అమలు చేసిన బ్యాలెట్‌ పత్రాల పద్ధతిని ఈసీ అమలు చేసేలా చూడాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల వినతిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించనుంది.

Spread the love