ఫోటోలు దిగి పార్లమెంటు పాత భవనానికి వీడ్కోలు..!

నవతెలంగాణ- న్యూఢిల్లీ: నేటి నుండి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు కొనసాగనుండగా.. పార్లమెంటు సభ్యులంతా పాత భవనంలో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గ్రూప్‌ ఫోటో దిగి వీడ్కోలు పలికారు. రైసినా హిల్స్‌ లో నూతనంగా నిర్మించిన భవనమే ఇకపై భారత పార్లమెంట్‌ అని కేంద్రం నిన్న రాత్రి గెజిట్‌ విడుదల చేసింది. లోక్‌సభ స్పీకర్‌ ఆమోదంతో లోక్‌సభ సచివాలయం ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది.
పాత భవనం వద్ద ఫోటోలు
మంగళవారం ఉదయం పాత పార్లమెంటు ప్రాంగణానికి సభ్యులంతా వచ్చారు. మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు విడివిడిగా ఫొటో దిగారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌, తదితరులు ముందు వరుసలో కూర్చున్నారు. ఉపరాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ మధ్యలో మోడి కూర్చొని కనిపించారు.
పాదయాత్రగా కొత్త పార్లమెంటుకు…
ఈ ఫొటో తర్వాత ఈరోజు ఉదయం 11.30 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలు సమావేశం కానున్నారు. అక్కడ అన్ని లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత ప్రధాని మోడి, రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌, మంత్రులు, ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళతారు. సెంట్రల్‌ హాల్‌లో ఉన్న రాజ్యాంగ పుస్తకాన్ని మోడి స్వయంగా తీసుకెళ్లనున్నారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఉదయం గణపతి పూజ జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత కొత్త భవనంలో లోక్‌సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 1.15 గంటకు ప్రారంభం కానున్నాయి. అలాగే రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభమవుతాయి.

Spread the love