తెలంగాణ క్రీడా పండుగ

– మే 15 నుంచి సిఎం కప్‌ టోర్నీ
– మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు
– పోటీపడనున్న 2 లక్షల మంది అథ్లెట్లు
2,00,000 మంది క్రీడాకారులు, 12,769 గ్రామాలు, 612 మండలాలు, 33 జిల్లాలు.. తెలంగాణ క్రీడా పండుగకు సిద్ధం. కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రం తొలిసారి రాష్ట్ర క్రీడా పండుగకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో సిఎం కప్‌ 2023 నిర్వహణకు అడుగు పడింది. మే 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర క్రీడా మంత్రిత్వ శాఖ, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) సిఎం కప్‌ నిర్వహణకు అద్భుత ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్ర క్రీడా రంగంలో ఇటువంటి ఓ భారీ స్థాయి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ జరుగనుండటం ఇదే ప్రథమం కానుంది!.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రతిభకు ఆహ్వానం
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించటం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు వీలుగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులను తయారు చేయటమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయటం, యువతలో స్పోర్ట్స్‌ కల్చర్‌ను తీసుకొచ్చేందుకు సిఎం కప్‌ 2023 నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్న ఈ పోటీల్లో పోటీపడేందుకు ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ పోటీల్లో సత్తా చాటిన నాణ్యమైన క్రీడాకారులను శాట్స్‌ యంత్రాంగం గుర్తించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనుంది. శాట్స్‌ అకాడమీల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను నిష్ణాతులైన కోచ్‌లు శిక్షణ ఇవ్వనున్నారు.
అంతర్జాతీయ ఈవెంట్లకు సన్నద్ధత!
జాతీయ క్రీడలు సహా అంతర్జాతీయ స్థాయి మెగా ఈవెంట్ల నిర్వహణపై తెలంగాణ రాష్ట్రం ఆసక్తి చూపుతోంది. సిఎం కప్‌ టోర్నీ నిర్వహణలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా వనరులను పూర్తి వినియోగంలోకి రానున్నాయి. క్రీడా యంత్రాంగం సైతం దాదాపు అన్ని క్రీడాంశాలకు సంబంధించి స్టేడియాలను, వసతులను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారీ ఎత్తున్న నిర్వహిస్తున్న సిఎం కప్‌ టోర్నీ అనుభవంతో రానున్న కాలంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పకడ్బందిగా కసరత్తు
సిఎం కప్‌ 2023 నిర్వహణకు రెండు నెలల ముందు నుంచే కసరత్తు మొదలైంది. జిల్లా స్థాయిలో చాలా చోట్ల క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు జిల్లా క్రీడల అధికారిగా కొనసాగుతున్నారు. క్షేత్ర స్థాయి నుంచి క్రీడల అభివృద్ది జరగాలంటే.. క్రీడాశాఖకు చెందిన వ్యక్తులే ఆ పదవిలో ఉండాలని క్రీడాశాఖ, శాట్స్‌ ఉన్నతాధికారులు భావించారు. తొలి అడుగుగా.. జిల్లా క్రీడాధికారులుగా స్థానికంగా ఉన్న సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 33 జిల్లాల్లోనూ క్రీడాశాఖకు చెందిన వ్యక్తులే జిల్లా యువజన, క్రీడల అధికారిగా నియమితులయ్యారు. సిఎం కప్‌ నిర్వహణ సహా ఇతర రెగ్యులర్‌ క్రీడల షెడ్యూల్‌ విజయవంతం అయ్యేందుకు ఇది దోహదం చేయనుంది.
నిర్వహణ కమిటీల ఏర్పాటు
సిఎం కప్‌ 2023 నిర్వహణకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయి సిఎం కప్‌ పోటీల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా ఎంపిపి ఉండనుండగా.. జడ్పీటిసి, ఎంపిడివో, ఎంఆర్‌వో, ఎంఈవో, ఎస్‌ఐ, మున్సిపల్‌ కమిషనర్‌, ఫిజికల డైరక్టర్‌ సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయి సిఎం కప్‌ నిర్వహణ కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మెన్‌గా ఉంటారు. జిల్లా ఎస్పీ వైస్‌ చైర్మెన్‌గా.. అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) కో-వైస్‌ చైర్మెన్‌గా ఉంటారు. జిల్లా క్రీడాధికారి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ సభ్యులు. ఇక రాష్ట్ర స్థాయి సిఎం కప్‌ పోటీల నిర్వహణ కమిటీకి క్రీడాశాఖ మంత్రి చైర్మెన్‌, శాట్స్‌ చైర్మెన్‌ కో-చైర్మెన్‌గా కొనసాగుతారు. క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మెన్‌గా, శాట్స్‌ వీసీ, ఎండీ కన్వీనర్‌గా ఉంటారు. రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, పంచాయత్‌ రాజ్‌ కమిషనర్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో పోటీల నిర్వహణకు రూ.15 వేలు, జిల్లా స్థాయిలో పోటీల నిర్వహణకు రూ.75 వేల చొప్పున మంజూరు చేశారు. మండల స్థాయిలో ఐదు క్రీడాంశాలు, జిల్లా స్థాయిలో 11 క్రీడాంశాలు, రాష్ట్ర స్థాయిలో 18 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.
ప్రతి ఏడాది సిఎం కప్‌
తెలంగాణ స్ఫూర్తి చాటడం, యువతలో ఐక్యత తీసుకురావటం, ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికతీయటం.. మూడు లక్ష్యాలతో సిఎం కప్‌ను నిర్వహిస్తున్నారు. సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పోటీపడనున్నారు. ఈ స్థాయిలో ఓ టోర్నీలో క్రీడాకారులు పాల్గొనటం ఇదే తొలిసారి కానుంది. మండల, జిల్లా స్థాయిల పోటీల అనంతరం.. రాష్ట్ర స్థాయిలో పోటీలకు శాట్స్‌ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. సుమారు 10,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అంచనా. అందుకోసం క్రీడాకారులకు నాలుగు రోజుల పాటు వసతి, భోజనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది సిఎం కప్‌ టోర్నీ నిర్వహించనున్నట్టు శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు.
సిఎం కప్‌ 2023 షెడ్యూల్‌
మండల స్థాయి : మే 15, 16, 17
జిల్లా స్థాయి : మే 22, 23, 24
రాష్ట్ర స్థాయి : మే 28, 29, 30, 31
సిఎం కప్‌ ప్రైజ్‌మనీ
వ్యక్తిగత విభాగం
స్వర్ణం : రూ. 20,000
రజతం : రూ.15,000
కాంస్యం : రూ.10,000
జట్టు విభాగం
స్వర్ణం : రూ.1,00,000
రజతం : రూ.75,000
కాంస్యం : 50,000
సిఎం కప్‌ పోటీలు
మండల స్థాయిలో.. :

మహిళలు : అథ్లెటిక్స్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌.
పురుషులు : అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌.
జిల్లా స్థాయిలో..
మహిళలు : అథ్లెటిక్స్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌.
పురుషులు : అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌
రాష్ట్ర స్థాయిలో..
మహిళలు : అథ్లెటిక్స్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్‌, లాన్‌ టెన్నిస్‌, షూటింగ్‌.
పురుషులు : అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌, కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, హ్యాండ్‌బాల్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్‌, హాకీ, లాన్‌ టెన్నిస్‌, షూటింగ్‌.

క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
సిఎం కప్‌ టోర్నీ నిర్వహణతో గ్రామీణ క్రీడలకు, క్రీడాకారులకు పెద్ద పీట వేయనున్నాం.
ప్రతి జిల్లాలోనూ యువజన, క్రీడల అధికారిగా క్రీడేతరుల స్థానంలో సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించాలి’

– ఇటీవల సమీక్ష సమావేశంలో మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌

తెలంగాణ స్ఫూర్తి చాటడం, యువతలో ఐక్యత,
ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులను వెలికితీయటమే సిఎం కప్‌ టోర్నీ ముఖ్య లక్ష్యాలు.
2 లక్షల మంది పోటీపడుతున్న సిఎం కప్‌ తెలంగాణలో యువతకు అతిపెద్ద క్రీడా పండుగ.
సిఎం కప్‌తో వెలుగులోకి వచ్చిన క్రీడాకారులకు శాట్స్‌ అకాడమీల్లో అత్యుత్తమ శిక్షణతో జాతీయ,
అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యేందుకు సహకారం అందిస్తాం.’

– ఆంజనేయ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌

Spread the love