ప్రజావ్యతిరేక బీజేపీని గద్దె దించాలి

– సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ – జమ్మికుంట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల పాలనలో ప్రజావ్యతిరేక విధనాలు అనుసరిస్తుందని.. ఆ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల సంక్షేమం గాలికొదిలి కార్పొరేట్లకు, పెట్టుబడుదారులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదరికంలోకి బీజేపీ ప్రభుత్వం నెట్టివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టగొట్టే జీవోలు తీసుకొచ్చిందని, 44 లేబర్‌ చట్టాలను నాలుగు కోడ్‌లుగా తెచ్చిందన్నారు. పని గంటల పెంపు తగదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు ఊడ పీకిందని విమర్శించారు. బేటి బచావో బేటి పడావో అన్న నినాదం కేవలం నినాదం గానే బీజేపీ చూస్తుందన్నారు. దేశ ప్రతిష్ఠను, కీర్తిని వ్యాపింపజేసే మహి ళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. వేధింపులకు గురి చేసిన సదరు ఎంపీపై చర్యలు తీసుకోవాలని సుమారు రెండు నెలలుగా క్రీడాకారులు ఢిల్లీ నడిబొడ్డున శాంతియుత ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్రప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయ మన్నారు. వెంటనే సదరు ఎంపీని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించినవి వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. 57సంవత్సరాల దాటిన ప్రతి వ్యక్తికి పింఛన్‌ సౌకర్యం కల్పించాలని, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలన్నారు. పేదలకు రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని, పేదలకు ఇంటి స్థలం కేటాయించి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ ప్రకటించి అమలు చేయాలని, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో పై సమస్యల పరిష్కారం కోసం అర్హులైన పేదలు, సీపీఐ(ఎం) నిర్వహించే ఆందోళన పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జోన్‌ కార్యదర్శి శీలం అశోక్‌, జోన్‌ కమిటీ సభ్యులు కొప్పుల శంకర్‌, రాములు, జక్కుల రమేష్‌, బాసిర సంపత్‌రావు, శ్రీకాంత్‌, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love