ప్రజలతో మమేకం అయితేనే సేవా దృక్పథం అలవడుతుంది

– వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వి. బాబురావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
జాతీయ సేవా పథకంలో విద్యార్థులందరూ పాల్గొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని, గ్రామాల్లో ఉండే సమస్యలు, వాటి పరిష్కారానికి అవలంబించే శాస్త్రీయ పద్ధతులపై తగిన అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు రైతులతో గ్రామ ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వి.బాబురావు అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులచే నిర్వహించే జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని మండలంలోని నారాయణపురంలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జే. హేమంత్‌ కుమార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ పతాక ఆవిష్కరణ తో ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జై.హేమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం ఏప్రిల్‌ 23 నుండి 29 వరకు 7 రోజులపాటు నారాయణపురం గ్రామంలో జరుగుతుందన్నారు. విద్యార్థులు గ్రామంలోని రోడ్లు, కార్యాలయాలను శుభ్రపరచడం, మొక్కలు నాటడం, వైద్య శిబిరం, పశు వైద్య శిబిరం, భూసార పరీక్షలు, పంటల సాగులో ఉత్తమమైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు వంటి వివిధ కార్యక్రమాలను చేపడతారన్నారు. మరో ముఖ్య అతిథి రవి హైబ్రిడ్‌ సీడ్స్‌ కార్య నిర్వహణ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే ప్రతి ఒక్కరూ సామాజిక సేవను అలవాటు చేసుకోవాలన్నారు.
వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్‌ బేగం మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని నూతన సాంకేతిక పద్ధతులు, అధునాతన సాగు పద్ధతులపై ఎగ్జిబిషన్లు నిర్వహించవలసిందిగా విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు కే. గోపాలకృష్ణమూర్తి, ఎం. రాంప్రసాద్‌, ఎస్‌.మధుసూదన్‌ రెడ్డి, పి.రెడ్డి ప్రియ, ఆర్‌.రమేష్‌లతోపాటు వ్యవసాయ అధికారులు సాయి నారాయణ, చంద్రశేఖర్‌, నవీన్‌, వ్యవసాయ విస్తరణ అధికారి షకీరా బాను,రైతు సోదరులు, వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. తరువాత జరిగినటువంటి కార్యక్రమంలో విద్యార్థులు నారాయణపురం గ్రామం లో సర్వే నిర్వహించారు.

Spread the love