ప్రజా రవాణాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

– ఆర్టీసీలో 16 నుండి 18గంటల డ్యూటీలు
– మహిళా ఉద్యోగులకు డ్యూటీల పేరుతో వేదింపులు
– ఆర్టీసీ పరిరక్షణకు పోరాటం తప్పదు
– విలేకరుల సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రయివేటు బస్సును ఆర్టీసీ సంస్థలో ప్రవేశపెట్టి ప్రజా రవాణాను సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, ఆర్టీసీ ఉద్యోగులు 16 నుండి 18గంటల డ్యూటీలు చేస్తున్నారని, మహిళా ఉద్యోగులకు డ్యూటీల పేరుతో వేదింపులు తప్పడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 2 శాతం నిధులుకేటాయించి ఆర్టీసీ ప్రజారవాణ సంస్థను కాపాడాలని, ఆర్టీసీ పరిరక్షణకు పోరాటం తప్పదని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి.ఎస్‌.రావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకే ప్రయివేట్‌ బస్సులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. కార్పోరేట్‌ కంపెనీలకు ప్రయివేటు బస్సులు కట్టబెట్టిందన్నారు. దీని వలన ఆర్టీసీకి ఎలాంటి లాభంలేదని తెలిపారు. ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. లాభాపేక్షతో చూడకుండా ప్రతిపల్లెకు బస్సులు నడపాలన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించి ఆర్టీసీని కాపాడాలని కోరారు. ఆర్టీసీలో కార్మికులకు పని భారం పెరిగిందని, ఉద్యోగులు రోజుకు 16 నుండి 18 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వలన అధికా డిప్రెషన్‌కు లోనై మరణిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగులకు సైతం రాత్రి 11 గంటల వరకు డ్యూటీలు చేయిస్తు వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. కారణంగా వారు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. వేతన సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. సంస్థ పరిరక్షణకు యూనియన్లపై ఉన్న నిర్బంధాలు ఎత్తు వేయాలన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం అంటే జీతాల పెంపె కాదని సంస్థను కాపాడుకోవడంకోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు ఏవీ రెడ్డి, జాకబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love