దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వం

– టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శ
నవతెలంగాణ – గంగాధర : దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. గంగాధరలో మేడిపల్లి సత్యం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే దశాబ్ది ఉత్సవాల పేరిట ఆర్భాటాలు చేస్తే అడ్డుకుంటామని అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణలో ఉత్సవాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మార్చి 23న సీఎం కెేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో, ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజక వర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారని అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఎకరాకు 10 వేల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించిన నేటికి అందించిన దాఖలాలు లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయకపోవడం వింతగా ఉందన్నారు. అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని అన్నారు. పంట నష్టపరిహారం కింద 152.64 కోట్లు మంజూరు చేసినట్లు ఓ పత్రికలో వార్త ప్రచురితమైందే కానీ నేటికి రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి జమ కాలేదన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగున్నర ఏండ్లు గడిచిన ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదన్నారు.ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ వల్ల రైతుల సమస్యలు రెట్టింపు అయ్యాయని, ముఖ్యంగా దళిత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 10 వేల నష్ట పరిహాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను అడ్డుకుని మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, నాయకులు బూర్గు గంగన్న, బట్టు లక్మినారయణ, తోట కరుణాకర్, కరీం, శ్రీనివాస్ రెడ్డి,మహేష్ పాల్గొన్నారు.

Spread the love