కోదాడ రోడ్డు ప్రమాదం…మృతులంతా ఒకే కుటుంబం వారు

– ప్రమాదంలో ఆరుగురు స్పాట్ డెడ్
– మరో నలుగురికి గాయాలు
– మృతులంతా ఒకే కుటుంబం వారు
నవతెలంగాణ కోదాడరూరల్
:  ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన సంఘటనలో ఆరుగురు మృతి చెందిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న కారు శ్రీరంగాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన జిల్లా శ్రీకాంత్ ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన పాపకు విజయవాడ వద్ద గల గుణదల వద్ద పుట్టు వెంట్రుకల కార్యక్రమానికి హైదరాబాదులోని మణికొండ నుండి ఒంటి గంట ప్రాంతంలో బయలుదేరి వెళుతున్న క్రమంలో శ్రీరంగాపురం జాతీయ రహదారి వద్ద లారీ ఆగి ఉండడంతో వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ వారి పెద్ద పాప లాస్య శ్రీకాంత్ అత్త మామ మాణిక్యమ్మ, చందర్రావు, శ్రీకాంత్ అక్క బావ కృష్ణంరాజు ,స్వర్ణకుమారి, అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాంత్ భార్య నాగమణి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాల పాలైన వారికి చికిత్స అందిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి . మరో ఐదు నిమిషాలు గడిస్తే చిమిర్యాల వద్ద ఉన్న శ్రీకాంత్ పెద్దమ్మను సైతం కారులో ఎక్కించుకొని గుణదలు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో చిమిర్యాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత రెండు రోజుల క్రితం ముకుందాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరువకముందే ఈ ప్రమాదం జరగడంతో వాహనదారులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, తాసిల్దార్ సూర్యనారాయణ ప్రభుత్వ ఆసుపత్రి లోని క్షతగాత్రులను, మృతుల బంధువులను పరామర్శించారు.

Spread the love