పంట పోయినంక.. ధర పెరిగింది

పసుపు క్వింటాకు రూ.1500-2000 పెరుగుదల
– మార్చి నెలఖరుకే రైతుల నుంచి కొనుగోలు
– బడా భూస్వాములకు, దళారులకు లాభాలు
– క్వింటాకు రూ.15 వేలు ప్రకటించాలని రైతన్నల డిమాండ్‌
– నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
– బోర్డు విషయంలోనూ ఇదే తీరు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
పసుపు మార్కెట్‌ మాయాజాలంతో మరోసారి రైతన్న కుదేలయ్యాడు. ఆరుగాలం కష్టపడి పంటను పండించి మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతు కన్నా.. ఆ పంటను అగ్గువకు కొని నిలువ చేసుకుని ఇప్పుడు అమ్ముకుంటున్న దళారులు, వ్యాపారులకు, బడా భూస్వాములకు పసుపు పంట లాభాలు కురిపిస్తోంది. సీజన్‌లో ఒక్కసారిగా పంట మార్కెట్‌కు పోటెత్తడంతో క్వింటాకు రూ.4000 నుంచి రూ.4,500కు కొనుగోలు చేసిన వ్యాపారులు.. ప్రస్తుతం అదే పంటను క్వింటాకు రూ.6000-రూ.6500కు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్‌లో భారీ వర్షాలతో పంట మునిగి పసుపు దిగుబడి తగ్గడంతో పాటు మార్కెట్‌లోనూ ధర లేక రెండు విధాలుగా పసుపు రైతు నష్టపోయాడు. పసుపు పంటకు క్వింటాకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రతియేటా పసుపు రైతు నష్టపోతూనే ఉన్నాడు.
నిజామాబాద్‌ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్‌, వేల్పూర్‌, మెండోరా మండలాలతో పాటు పక్క జిల్లా జగిత్యాలలో రైతులకు పసుపు పంట జీవ నాధారం. భారతదేశంలో అత్యధికంగా పసుపు సాగ య్యే ప్రాంతాల్లో నిజామా బాద్‌ కూడా ప్రధానమైనది. ఇక్కడ దిగుబడి అయ్యే పంట దేశవిదేశాలకు ఎగు మతి అవుతోంది. ఇక సంఖ్యా బలం పరంగా నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్థుల రాజకీయ తలరాతలను తారుమారు చేసే సత్తా ఇక్కడి పసుపు రైతులకు ఉన్నది. అంతటి ప్రాచుర్యం కలిగిన పసుపు పంటను సాగు చేస్తున్న రైతులకు మాత్రం నష్టాలే ఎదురవుతున్నాయి. ఈ సీజన్‌లో జిల్లాలో 35 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. ఈ పంటను జనవరి నెలఖారు నుంచి ఏప్రిల్‌ చివరి వరకు రైతులు మార్కెట్‌లో విక్రయించారు. కానీ సీజన్‌లో పసుపు పంట ధర భారీగా పతనమయ్యింది. ఒక్కసారిగా మార్కెట్‌కు పంట పోటెత్త డంతో వ్యాపారులు సిండి కేట్‌గా మారి ధరను అమాం తం తగ్గించారు. క్వింటాకు కేవలం రూ.4000- రూ.4500 వరకు కొనుగోలు చేశారు. అంతకముందు యేడా ది రైతులు తమ పంటను రూ. 8000 వరకు కూడా అమ్మకాలు చేశారు. కానీ ఈ యేడాది ధర ఏమాత్రమూ పెరగలేదు. ఒక్కో రోజు మార్కెట్‌కు 14,000 క్వింటాళ్ల వరకు పసుపు వచ్చి చేరింది. కానీ 90 శాతం మంది రైతుల పంటను క్వింటాకు రూ.5000 లోపు కొనుగోలు చేశారు. అమ్మకం సీజన్‌ ముగియగానే పసుపు ధర అమాంతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో క్వింటాకు ధర రూ.1500- రూ.2000 పెరిగింది. అత్యధికంగా రూ.8289 ధర కూడా పలికింది. పైగా ఈ ధర రానున్న రోజుల్లో క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు కూడా పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. సీజన్‌లో రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న దళారులు, వ్యాపారులు, బడా భూస్వాములు ప్రస్తుతం రెండింతల లాభాలు పొందుతున్నారు.
పసుపు రైతులను పట్టించుకోని మోడీ సర్కారు..
పసుపు రైతుల మద్దతుతో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి ఎన్నికల్లో గెలి చిన తరువాత అటకెక్కించింది. పసుపు బోర్డు తరువాత ఈ ప్రాంత రైతుల రెండో ప్రధానమైన డిమాండ్‌ను కూడా కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం. పసుపు పంటకు క్వింటాకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని గత లోక్‌ సభ ఎన్నికల్లో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలి సిందే. బీజేపీ అధికారంలోకి వస్తే పసుపు పంటకు గిట్టు బాటు ధర కల్పిస్తామని, దేశవిదేశాల్లో బ్రాండ్‌ ప్రచారం కల్పించి ధర పెరిగేలా కృషి చేస్తామని చెప్పిన ఎంపీతో పాటు బీజేపీ పెద్దలు ప్రస్తుతం మాటెత్తడం లేదు. ఒకవేళ రైతుల డిమాండ్‌ మేరకు కేంద్ర ప్రభుత్వం పసుపు పంటకు క్వింటాకు రూ.15 వేలు పెంచినట్టయితే రైతులకు నష్టాలు మిగిలేవి కావు.
మహారాష్ట్ర రైతు కన్నా తక్కువ ధర…
మహారాష్ట్రలో సాగు చేసే పసుపు పంటతో పొల్చితే జిల్లాలో సాగయ్యే పసుపు పంట నాణ్యత ఎక్కువగా ఉంటుంది. కానీ విచిత్రమేమిటంటే జిల్లా రైతుల కన్నా ప్రస్తుతం మార్కెట్‌లో అమ్మకాలు చేస్తున్న మహారాష్ట్ర రైతులకు ధర ఎక్కువ పలకడం గమనార్హం. జిల్లాలో సాగయ్యే పసుపుతో పొల్చితే మహారాష్ట్ర పంటలో కొంత ఎరుపు రంగు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పంటకు సగటున క్వింటాకు రూ.6060 వరకు పలుకుతోంది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో మే నుంచి జూన్‌ వరకు మహారాష్ట్ర పసుపు అమ్మకాలు జరుగుతాయి.
బయటి మార్కెట్‌లో డిమాండ్‌ వల్ల ధర పెరుగుదల
సీజన్‌లో కొన్న ధర కంటే ప్రస్తుతం ధర పెరిగిన మాట వాస్తవమే. రూ.1500 నుంచి రూ. 2000 వరకు ధర పెరిగింది. పసుపునకు డిమాండ్‌ పెరిగితే ధర పెరుగుతుంది. జిల్లాలో రైతులు పండించే పంటల్లో నాణ్యతలో చాలా రకాలుగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగితే ఇక్కడి వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ-నామ్‌లో కొనుగోలు చేసే వ్యాపారులు కమీషన్‌ ఏజెంట్లుగా ఉన్నారు. బయట ధర పెరిగితే ఆ ధర ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు.
– వెంకటేశం, నిజామాబాద్‌
వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి

Spread the love