తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్
కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, స్వీపర్స్, పేషంట్ కేర్, సెక్యూరిటీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియోద్దీన్, కె.యాదనాయక్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ ప్రాంగణంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.15,600 వేతనంలో భాగంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి సుమారు రూ.11,000 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేతనాలు చెల్లించేలా ఆస్పత్రుల అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియోద్దీన్ మాట్లాడుతూ.. వేతనాలు క్రమం తప్పకుండా ప్రతినెలా 1న చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000గా నిర్ణయించాలన్నారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని కోరారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టర్ల వేధింపులను అరికట్టాలని, కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫారాలు, షూస్, అవసరమైన పరికరాలు అందించాలన్నారు. అనంతరం డీహెచ్, డీఎంఈ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమారస్వామి, వివిధ ఆస్పత్రుల కార్మికులు పాల్గొన్నారు.
ప్రభుత్వాస్పత్రుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



