సీపీఐ(ఎం) పోరాటాల ఫలితమే పోడుకు పట్టాలు..

– సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
సీపీఐ(ఎం) నిర్వహించిన ప్రజా, గిరిజన పోరాటాల ఫలితం గానే నేడు సాగుదారులందరికీ హక్కుపత్రాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఈ నిర్ణయం అమలు కోసం తేదీలు కూడా ప్రకటించడం హర్షించదగిన పరిణామం అని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. తాతల కాలం నుంచి గిరిజనులు, గిరిజనేతరులు తమ సాగులో ఉన్న భూములను సాగు చేసుకుంటున్నారని అట్టి భూములకు హక్కు పత్రాలు లేని కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, అనేక సంవత్సరాలుగా పార్టీ నిర్వహించిన పోరాటాల ఫలితంగా నేడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదేనని అన్నారు. అయితే ఇప్పటివరకు సాగులో ఉన్న లబ్ధిదారులకు అందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వేలు నిర్వహించిన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని తెలిపారు. సర్వేల సందర్భంగా కొన్ని సమస్యలు వచ్చినందున కొన్ని గ్రామాల్లో వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను సర్వేలో పరిగణించకుండా పక్కన పెట్టారని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు సాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. లేదంటే పట్టాలు రానివారు నిరాశకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. పట్టాలు ఇచ్చిన తర్వాత సాగులో ఉన్న అన్ని భూములను సదును చేసుకోవడానికి ల్యాండ్‌ డెవలప్మెంట్‌ స్కీం కింద నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పట్టా హక్కులు ఉన్నవారికి వివిధ కారణాల చేత పట్టా హక్కులు రానివారికి కూడా మానవతా దృక్ప థంతో రైతుబంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టాలు ఉన్నవారందరికీ బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని రూ.3 లక్షల నిర్మాణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. గ్రామాలలో, పట్టణాలలో అర్హులుగా ఉండి ఇంటి స్థలం లేని పేదలు లక్షల్లో ఉన్నారని వారిని కూడా గుర్తించాలని కోరారు. సొంత స్థలం ఉన్న వారికి అందరికీ నిర్మాణ వ్యయం కనీసం రూ.ఐదు లక్షలు మంజూరు చేయాలని కోరారు.

Spread the love