జల సంరక్షణలో జిల్లాకు జాతీయ పురస్కారం

– జగన్నాధపురం పంచాయతీకి అవార్డు
– జాతీయ స్థాయిలో మొదటి స్థానం
– సర్పంచ్‌ను సన్మానించిన కలెక్టర్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జాతీయ స్థాయిలో పలు అవార్డులు సొంతం చేసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం, జల సంరక్షణ, హెల్దీ పంచాయతీ, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌, హరితహారం, మౌళిక సదుపాయాల కల్పన, సాంఘీక భద్రత, డిజిటలైజేషన్‌, మహిళా సాధికారత, స్వచ్చా భారత్‌ లాంటివాటితో కూడిన 9 అంశాలలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న జిల్లా గ్రామ సర్పంచులు పలు ఆవార్డులు సాధించి పెట్టారు. తాజాగా జల సంరక్షణకు చేపట్టిన చర్యలు ఫలితంగా కేంద్ర జలసంరక్షణకు గాను జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి మొదటి స్థానంలో నిలవడం జిల్లా ప్రజలకు గర్వకారణం. జిల్లాలోని ముల్కలపల్లి మండలంలోని, జగన్నాధపురం గ్రామ పంచాయతీకి జల సంరక్షణ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం లభించడం జరిగింది. జల సంరక్షణకు మన జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు ఆదర్శమవుతున్నాయి. అడుగంటి పోతున్న భూగర్బ జలాలు పరిరక్షణకు చేసిన చర్యలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసేందుకు కేంద్ర బృందం 2023 ఫిబ్రవరిలో పరిశీలించారు. వారి నియమావళి ప్రకారం తనిఖీ చేయడం జరిగింది.
జల సంరక్షణకు చర్యలు
ఉపాధిహామీ పథకంలో చెరువులు, పెద్ద, చిన్న ఊటకుంటలు, చెక్‌ డ్యామ్‌లలో 62 పూడికతీత పనులు చేశారు. 2020-21, 2021-22 సంవత్సరాలలో చేపట్టిన పనులతో 79, 618 క్యూసిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగినట్లు గుర్తించారు. మిషన్‌ కాకతీయలో16 చెరువులను, వాటర్‌షెడ్‌లో 2 ఊట కుంటలను, మిషన్‌ అమృత్‌ సరోవర్‌లో ఒక నీటి ఊటకుంట పునరుద్దరించడం జరిగింది. జగన్నాధపురం గ్రామ పంచాయితీలో జిల్లా ఏర్పాటు తదుపరి ఆగస్టు 2022 వరకు 402 ఎకరాలలో హార్టికల్చర్‌, ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ పనులను చేపట్టడం జరిగింది. 2020-21 నుండి ఆగస్టు, 2022 వరకు 235 ఎకరాలను మైక్రో ఇరిగేషన్‌ పద్ధతిలోసాగు చేయడం జరుగుతుంది. 2020-21,2021-22 సంవత్సరములలో పచ్చదనం పెంచడానికి 50 వేలకు పైగా మొక్కలను హరితహారంలో నాటారు. వాటర్‌ షెడ్‌ కార్యక్రమములో భాగంగా 134 వివిధ రకాల నీటి సంరక్షణ పనులు అనగా ఊటకుంటలు, చెక్‌ డ్యాంలు, బోర్‌ వెల్‌ రీచార్జి నిర్మాణాలను చేపట్టడం ద్వారా 6.50 లక్షల క్యూసిక్‌్‌ మీటర్లకు పైగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కల్పించడం జరిగింది. ఇరిగేషన్‌ శాఖ ద్వారా 31 యం.ఐ. ట్యాంకుల కింద 1.98 మిలియన్‌ క్యూసిక్‌ మీటర్ల సామర్ధ్యంతో 1087 ఎకరాల భూమి సాగులో ఉపాధిహామీలో చేపట్టిన 22 నీటి సంరక్షణ పనుల ద్వారా సుమారు ఒక లక్ష క్యూ.మీ. నీటి సామర్ధ్యాన్ని స్థిరీకరించడం విజయంగా చెప్పవచ్చు. ఈ గ్రామములో చేపట్టిన వివిధ నీటి సంరక్షణ పనుల ద్వారా 27.63 లక్షల క్యూ.మీ. నీటి సామర్ధ్యాన్ని కల్పించడం జరిగింది. 2020 సంవత్సరములో 2553 ఎకరాలుగా వున్న సాగునీటి సౌకర్యం, 2022 కి 5356 ఎకరాలకు పెరిగింది. ఏకంగా అదనంగా 2803 ఎకరాలకు పెరిగింది. అలాగే అన్ని రకాల పంటలు కలిపి 2020 లో 6332 ఎకరాలు ఉండగా 2022 లో అది 10,095 ఎకరాలకు అనగా 3763 ఎకరాలలో అదనంగా సాగు విస్తీర్ణంపెరిగింది.
కలెక్టర్‌ అభినందనలు….
ములకలపల్లి మండలం, జగన్నాధపురం పంచాయతీకి జల సంరక్షణ చర్యలకు గాను జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం వచ్చిన సందర్భంగా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ గ్రామ సర్పంచ్‌ గడ్డం భవానిని శాలువాతో ఘనంగా సత్కరించారు. జల సంరక్షణ చర్యల్లో మీ కృషికి జాతీయ స్థాయిలో గౌరవం లభించిందని, మన జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేశారని అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరారు. ఇందుకు కృషి చేసిన డిఆర్‌డిఏ, పంచాయతీ రాజ్‌ తదితరఅధికారులను ప్రతేకంగా అభినందించారు.

Spread the love