భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

నవతెలంగాణ – ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయమే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. ఆసియా మార్కెట్లు ఉదయం మిశ్రమంగా ప్రారంభమైనప్పటికీ.. ముగింపు మాత్రం సానుకూలంగా నమోదైంది. రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు రాణించడమూ మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ కనిపించింది. ఉదయం సెన్సెక్స్‌ 61,985.36 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,529.83 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 629.07 పాయింట్ల లాభంతో 62,501.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,368.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,508.55 దగ్గర గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 178.20 పాయింట్లు లాభపడి 18,499.35 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకొని 82.58 దగ్గర నిలిచింది.

Spread the love