ఉపాధి కూలీల సమస్యలపై ఆగ్రహం..
నవతెలంగాణ – సిర్పూర్ (టి )
మండలంలోని లోనివెళ్లి, కంచరపేట్ గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముంజం ఆనంద్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా “రెండు పూటల ఫోటో” విధానం కారణంగా అనేక మంది కూలీల పనులు నమోదు కాకపోవడంతో వేతనాలు నిలిచిపోతున్నాయని తెలిపారు. ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉపాధి కూలీలకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని, మూడు నెలలుగా జీతాలు అందక ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి బకాయిలను కూడా ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని కోరారు. పనిలో అనుభవం ఉన్న సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించి న్యాయం చేయాలని, ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేకుండా కూలీలు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
“జి రామ్ జి” పేరుతో తీసుకొస్తున్న విధానాల ద్వారా ఉపాధి కూలీలను మోసం చేస్తూ వారి హక్కులను హరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉపాధి కూలీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొర్కుట్ రాజేందర్‌తో పాటు ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.



