ఢిల్లీ పోలీసుల అత్యుత్సాహం

The zeal of the Delhi Police– సీపీఐ(ఎం) కార్యాలయంలో కార్యక్రమాల అడ్డగింత
– ప్రతిఘటనతో వెనుకడుగు…
– జాతీయ పార్టీ కార్యాలయంలో సమావేశాలను అడ్డుకోవటం దుర్మార్గం
– ఈసీకి ఫిర్యాదు చేస్తాం : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ పోలీసులు మళ్లీ అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఐ(ఎం) కార్యాలయం(హరి కిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌)లో కార్యక్రమాలు అడ్డుకునేందుకు యత్నించారు. ప్రతిఘటనతో ఢిల్లీ పోలీసులు వెనుదిరిగారు. జాతీయ పార్టీ కార్యాలయంలో సమావేశాలను అడ్డుకోవడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని సీపీఐ(ఎం) నేతలు పేర్కొన్నారు. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ (హెచ్‌ కె ఎస్‌) భవన్‌ వద్ద సీపీఐ(ఎం) కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు. మంగళవారం నుంచి సూర్జిత్‌ భవన్‌లో మూడు రోజుల పాటు పార్టీ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం వర్క్‌షాప్‌ ప్రారంభం కావడానికి ముందు, ఢిల్లీ పోలీసుల బృందం సూర్జిత్‌ భవన్‌కు చేరుకుని, కార్యక్రమానికి అనుమతించలేమని వారికి తెలిపింది. ఎస్‌హెచ్‌ఓ నేతృత్వంలో బృందం వచ్చింది. జీ20 సమ్మిట్‌ ముగిసే వరకు సూర్జిత్‌ భవన్‌లో ఎటువంటి కార్యక్రమాన్ని అనుమతించరాదని ఎస్‌హెచ్‌ఓ పేర్కొన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరైన పార్టీ కార్యక్రమం అని, ఏసీపీతో సహా ఉన్నతాధికారులకు సమాచారం అందించామని సుర్జిత్‌ భవన్‌లోని యాజమాన్యం ఎస్‌హెచ్‌ఓకు తెలిపారు. ఏసీపీని సంప్రదించడంతో పోలీసు బృందం వెనుదిరిగింది. ఎస్‌హెచ్‌ఓ దురుసుగా ప్రవర్తించడంపై సీపీఐ(ఎం) నాయకత్వం ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. జాతీయ పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలకు కూడా అంతరాయం కలిగించే చర్యపై ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతరులకు ఫిర్యాదు చేస్తామని నాయకత్వం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. రెండు రోజుల క్రితం జీ20 సదస్సుకు ప్రత్యామ్నాయంగా సూర్జిత్‌ భవన్‌లో సమావేశమైన పీపుల్స్‌ గ్రూప్‌ ‘వీ20’ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వ్యతిరేకతతో మూడు రోజుల కార్యక్రమంలో చివరి రోజు సెషన్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తరువాత పార్టీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించారు.

Spread the love