చేయాల్సింది చాలా ఉంది

చేయాల్సింది చాలా ఉందిసివిల్స్‌… ఎందరికో ఓ కల. నిజం చేసుకోవాలంటే కృషి, పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యం. ఇక అమ్మాయిలు విజయం సాధించాలంటే వారి కృషితో పాటు కుటుంబ సహకారం తప్పని సరి. తన కలను నిజం చేసుకోవడం కోసం కార్పొరేట్‌ ఉద్యోగాన్నే వదిలేసింది. కుటుంబ సహకారంతోనే రెండు సార్లు పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యింది. అయినా అనుకున్న లక్ష్యం చేరేందుకు పట్టుదలతో మరింత శ్రమించింది. ఆమే చందన కూరుగంటి. ఇటీవలె విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఆలిండియా 50వ ర్యాంక్‌ సాధించిన హైదరాబాదీతో మానవి సంభాషణ…
మీ కుటుంబ నేపథ్యం చెప్పండి..?
మా సొంతూరు హైదరాబాద్‌. నాన్న రాంబాబు, సాఫ్ట్‌వేర్‌. అమ్మ లక్ష్మి ప్రైమరీ టీచర్‌. నాన్న ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాము. నేను పుట్టింది బెంగుళూర్‌. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. కొంతకాలం విదేశాల్లో కూడా ఉండి హైదారాబాద్‌ వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని భారతీ విద్యా భవన్‌లో 6వ తరగతిలో చేరాను. అక్కడే 10వ తరగతి పూర్తిచేశాను. రామయ్య ఇనిస్టిట్యూట్‌లో ఇంటర్‌ పూర్తి చేశాను. మా తాతయ్య రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. దాంతో నా చిన్నప్పటి నుండి ఇంట్లో ఆ వాతావరణం ఉండేది.
సివిల్స్‌ చేయాలనే ఆలోచనతోనే మీ చదువు మొదలుపెట్టారా..?
మొదట్లో అలా ఏమీ లేదు. నేను కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశాను. తర్వాత రెండేండ్లు ఎంబీఏ కూడా చేశాను. పెద్ద కార్పొరేట్‌ కంపెనీలో జాబ్‌ వచ్చింది. అక్కడ 14 నెలలు పని చేసిన తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. నాకు అదే సరైనదనే నిర్ణయానికి వచ్చాను. వెంటనే ఆ జాబ్‌ వదిలేసి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. పరీక్షలు రాస్తే పాసై ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌కి రికమండ్‌ చేశారు. అక్కడ 21 నెలలు ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ తర్వాత 2022లో మళ్ళీ ఎగ్జామ్‌ రాస్తే రెవిన్యూ శాఖ ఇన్‌కంటాక్స్‌లో పోస్ట్‌ వచ్చింది. ఆ జాబ్‌లో జాయిన్‌ అయ్యాను. మళ్ళీ ప్రయత్నం చేద్దామని 2023 మళ్ళీ ఎగ్జామ్‌ రాశాను. ఇప్పుడు 50వ ర్యాంక్‌ వచ్చింది.
ఒక పోస్ట్‌ వచ్చింది కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు రాశారు?
గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అయ్యేటపుడే ఐఏఎస్‌ సర్వీస్‌లో ఉండాలనేది నా కల. అంతకు ముందు వచ్చిన పోస్టులు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న రెవెన్యూ సర్వీస్‌ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా రెవెన్యూ చాలా ముఖ్యం. అయితే మొదటి నుండి ఐఏఎస్‌ నా గోల్‌ కాబట్టి ఓ ప్రయత్నం చేద్దామని ఎగ్జామ్స్‌ రాశాను. ఈ సారి మంచి ర్యాంక్‌ వచ్చింది. ఈ ర్యాంక్‌ రాకపోయినా రెవెన్యూలో కూడా హ్యాపీగానే ఉండేదాన్ని.
మరి ఇంట్లో వాళ్ళు ఎలా సహకరించారు?
నేను తీసుకున్న నిర్ణయాని గౌరవిస్తారు. బటయకు వెళ్ళి ఇంజనీరింగ్‌ చేస్తానన్నా, తర్వాత ఎంబీఏ చేస్తానన్నా, జాబ్‌ వదిలేసి గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతానన్నా ఇంట్లో ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయం కరెక్టుగా ఉంటుందని వాళ్ళ నమ్మకం. ‘ఎందుకు, అవసరమా?’ అనే ప్రశ్నలు వారి నుండి రాలేదు. మంచి ర్యాంక్‌ వచ్చినా, రాకపోయినా నా నిర్ణయానికి నన్ను వదిలేశారు. కాబట్టి ఇంట్లో నాకు మంచి సపోర్ట్‌ ఉంది.
చిన్నతనం నుండి స్వేచ్ఛగా పెరిగారా?
చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో పెంచారు. విదేశాల్లో ఉన్నా అలాగే ఉండేవాళ్ళం. చిన్నతనంలో నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు కానీ ఎప్పుడైతే నా నిర్ణయాలు నేను తీసుకోగలను అని నమ్మారో అప్పుడు నాకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను నేను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. కాబట్టే నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్ళు గౌరవిస్తారు. ఏ విషయంలో అయినా బ్యాలెన్స్డ్‌గా ఉండాను. అలాగే ఇంట్లో కూడా ఎప్పుడూ చదువూ చదువూ అనే వారు కాదు. చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ నేర్చుకుంటున్నాను. చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్‌లో కూడా ప్రోత్సహించేవారు. అలాగే క్లాస్‌ పుస్తకాలతో పాటు జనరల్‌ పుస్తకాలు కూడా చదవమనేవారు. అమ్మానాన్న ఇలా పెంచబట్టే ఈ రోజు నేను ఇలా ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నాను. ఇలాంటి వాతావరణం ప్రతి ఇంట్లోనూ ఉండాలి. అంటే పిల్లల ఎదుగుదలకు చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్‌ కూడా చాలా అవసరం. ఆటల్లో, కళల్లో కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి.
మీ కోచింగ్‌ ఎప్పుడు ప్రారంభమయింది?
జాబ్‌ చేస్తున్నప్పుడే నేను సంపాదించిన డబ్బుతోనే కోచింగ్‌ తీసుకోవాలని అనుకున్నాను. ఒక కోచింగ్‌ సెంటర్‌కు డబ్బు కూడా కట్టాను. అయితే కోవిడ్‌ రావడంతో క్లాసులు ఏమీ జరగలేదు. ఆన్‌లైన్‌ వీడియోలు కొన్ని చూశాను. సోషయాలజీ అనే ఆప్షన్‌కు వీడియోలు చూశాను. కోచింగ్‌ సెంటర్ల తరపున చాలా మాక్‌ టెస్టులు రాశాను. ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి.
మీలా గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న అమ్మాయిలకు మీరిచ్చే సలహా..?
మొదట తల్లిదండ్రులు అమ్మాయిలను ప్రోత్సహించాలి. పిల్లల కలలు నిజం చేసుకునేందుకు అన్ని విధాలుగా సపోర్ట్‌ చేయాలి. సాధించినా సాధించలేకపోయినా ప్రయత్నించేందుకు సహకరించాలి. బయట వాళ్ళు ఏమన్నా ‘నీకు మేమున్నాం’ అనే మోరల్‌ సపోర్ట్‌ తల్లిదండ్రులు అమ్మాయికి ఇవ్వాలి. అలాగే అమ్మాయిలు కూడా సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ పెంచుకోవాలి. ‘నేను చేయగలను’ అనే నమ్మకం ఉండాలి. గతంలో విజయం సాధించిన వారి నుండి స్ఫూర్తి పొందాలి. అప్పుడు కచ్చితంగా అనుకున్నది సాధించగలరు.
– సలీమ 

Spread the love