లోకో పైలట్లు క్రికెట్‌ చూశారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు

– దర్యాప్తు అధికారులు
చెన్నై : గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగిన సమయంలో లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో అందుకు సంబందించి ఎలాంటి ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో ‘లోకో పైలట్‌, కో-పైలట్‌ ఇద్దరూ క్రికెట్‌ చూడ్డం వలన రైలు ప్రమాదం జరిగింది’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. లోకోపైలట్‌ ఎస్‌ఎంఎస్‌ రావు, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఎస్‌ చిరంజీవి (రైలు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు) ఉపయోగించిన మొబైల్‌ ఫోన్లలో డేటా వినియోగంపై పరిశోధన జరిపిన ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ప్రంజీవ్‌ సక్సేనా కూడా తన నివేదికలో లోకో పైలట్లు క్రికెట్‌ చూస్తున్నారని పేర్కొనలేదు. గత ఏడాది అక్టోబర్‌ 29న విజయనగరం జిల్లాలో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢికొన్న ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 34 మంది గాయపడ్డారు.
ఈ ఏడాది మార్చి 3న, రైల్వే మంత్రి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘లోకో పైలట్‌, కో-పైలట్‌ ఇద్దరూ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ పరధ్యానంలో పడ్డారు. ఇప్పుడు మేము అటువంటి పరధ్యానాన్ని గుర్తించగల వ్యవస్థలను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడున్న పైలట్‌లు, అసిస్టెంట్‌ పైలట్లు రైలును నడపడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి’ అని అన్నారు.
రైల్వే మంత్రి వ్యాఖ్యలపై వాల్తేరు డివిజన్‌లోని ఒక సీనియర్‌ అధికారి స్పందిస్తూ ‘లోకో పైలట్‌, అతని సహాయకుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు, డ్యూటీలో ఉన్నప్పుడు క్రికెట్‌ చూస్తున్నారని ఆరోపిస్తూ రికార్డు చేయడం ”తీవ్రమైన” పొరపాటు’ అని అన్నారు. ‘దీన్ని (రైల్వే మంత్రి ఆరోపణలు) రుజువు చేయడానికి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం పుకారు మాత్రమే. మేము కారుణ్య ప్రాతిపదికన వారి జీవిత భాగస్వాములకు ఉపాధి కల్పించాము’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు చెప్పారు.

Spread the love