బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లుండవు…

– అందుకే 400 సీట్లు అడుగుతోంది
– ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్నే ఆ పార్టీ అమలు చేస్తుంది
– ఈ ఎన్నికలు రిజర్వేషన్ల కొనసాగింపుపై రిఫరెండం
– ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీకి భయం పట్టుకుంది
– నాడు మండల్‌ అంటే కమండల్‌ అన్నది
– రిజర్వేషన్లు కావాలనే నేతలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలి
– దేశాన్ని ఎక్స్‌రే తీస్తాం…వారి వాటా వారికిస్తాం… : బీజేపీపై చార్జిషీట్‌ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. లోక్‌సభలో 400 సీట్ల భారీ మెజార్టీ సాధించడం ద్వారా రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనతో ఉందని చెప్పారు. రిజర్వేషన్లు కొనసాగించా లనేది కాంగ్రెస్‌ నిర్ణయమనీ, దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు కొనసాగించాలా? వద్దా? అనేది ఈ ఎన్నికల్లో రిఫరెండం అని తెలిపారు. తమ పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ‘నయవంచన- పదేండ్ల మోసం…వందేండ్ల విధ్వంసం’ అంటూ బీజేపీపై నాలుగు పేజీల చార్జీషీట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, నాయకులు జి నిరంజన్‌తో కలిసి సీఎం రేవంత్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన చేపట్టి దేశాన్ని ఎక్స్‌రే తీస్తామంటూ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే కొంత మంది నేతలు బీజేపికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో, వారికి ఓటు వేయాలని ఎందుకు కోరుతున్నారో అర్థం కావడం లేదంటూ మందకృష్ణనుద్దేశించి పరోక్షంగా చురకలంటించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ వైపు నిలబడొద్దని హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనను దేశంపై రుద్దేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని విమర్శించారు. వందేండ్లలో రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించిన రోజే నిర్ణయించుకుందని తెలిపారు. తమకు మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభమవుతుందనే ఉద్దేశంతోనే మోడీ 400 సీట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఆయన దేశాన్ని మోసం చేశారని విమర్శించారు. డబుల్‌ ఇంజిన్‌ అంటే అదానీ, ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలి
ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతామంటూ రాహుల్‌గాంధీ ప్రకటించడం తో బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారని వివరించారు. మండల్‌ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్‌ ఉద్యమాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుందని హెచ్చరించారు. రిజర్వేషన్లు ఉండాలనుకునే వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలనీ, వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయాలని రేవంత్‌ సూచించారు. కాంగ్రెస్‌పై విష ప్రచారం చేసి ఎలాగైనా గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు.
మోడీ చేసిన అప్పులే ఎక్కువ..
దేశంలో గత 14 మంది ప్రధానుల కంటే మోడీ చేసిన అప్పులే ఎక్కువ అని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. పదేండ్లలో రూ.113 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. దేశ ప్రజలపై రూ. 168 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేశారు. కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమన్నారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రధాని…పార్లమెంటు సాక్షిగా అన్నదాతలకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. చేనేత నుంచి కుటీర పరిశ్రమ వరకు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతోందన్నారు. అగ్గిపెట్టె, సబ్బు బిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నట్టు చివరకు అగర్‌బత్తీలపై కూడా జీఎస్టీ వేసిందన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్‌ కూడబెట్టిన ఆస్తులను మోడీ పదేండ్లలో కార్పొరేట్లకు కట్టబెట్టారని విమర్శించారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తా నన్న ప్రధాని పది పైసలు కూడా తేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెట్రోల్‌ ధర రూ. 55 నుంచి రూ.110 వరకు పెరిగిందన్నారు. జీఎస్టీ పేరుతో మోడీ దోపిడీ చేశారని విమర్శించారు. చిన్న పిల్లల పెన్సిల్‌, రబ్బర్‌లపై కూడా జీఎస్టీ వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేశారన్నారు.

Spread the love