ఊరేగింపు సందర్భంగా ఉమ్మి వేశారని..!

– ఉజ్జయినిలో ముగ్గురు ముస్లిం యువకుల అరెస్టు…వారి ఇండ్లు కూల్చివేత
ఉజ్జయిని : ‘మహాకాల్‌ కీ సవారీ’ ఊరేగింపు వెళుతుండగా ఉమ్మి వేసినట్లు ఆరోపించి ముగ్గురు ముస్లిం యువకులను అరెస్టు చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో జరిగింది. అనంతరం ఆ ముగ్గురి ఇళ్ళను ధ్వంసం చేసి కూల్చివేశారు. ఇందుకు సంబంధించి జులై 17న ఉజ్జయిని నగరంలోని ఛాత్రి చౌక్‌ ఏరియాలో తీసిన రెండు వేర్వేరు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఆ ముస్లిం యువకుల అరెస్టుకు దారి తీశాయి. ఊరేగింపులో పాల్గొన్న యువకులే ఈ వీడియోలు తీశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కాగా, మూడో వ్యక్తికి 18ఏళ్ళు. ఆ వ్యక్తుల ఇళ్ళ కూల్చివేత సందర్భంగా డ్రమ్ములు, డిజె మ్యూజిక్‌లతో హోరెత్తించారు. ‘బుల్డోజర్‌ న్యాయం’ పేరుతో జరుగుతున్న సంఘటనల జాబితాలో ఇదొక కొత్త చేరిక. ఆ ముగ్గురు గుర్తు తెలియని నిందితులపై ఐపిసిలోని వివిధ విభాగాల కింద ఖరకువా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. మత భావాలను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా చర్యలు చేపట్టడం, ఆరాధనా స్థలంలో నేరాలు, మత పరమైన సమావేశాలను కల్లోలపరచడం వంటి అభియోగాలను మోపారు. ఇండోర్‌ వాసి మసూమ్‌ జైస్వాల్‌ తన ఫోన్‌లో ఈ మొత్తం సంఘటనను రికార్డు చేశాడని ఫిర్యాదీదారుడు సావన్‌ లాట్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. నిందితుల్లో ఇద్దరి అంకుల్‌ అయిన అక్బర్‌ హుస్సేన్‌తో ది వైర్‌ మాట్లాడింది. కూల్చివేసిన ఆ ఇంట్లోనే వీరి కుటుంబం కూడా నివసిస్తోంది. తమ పిల్లలు ఉమ్మి వేశారని అనడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రతి ఏటా ఊరేగింపులు జరుగుతాయని, వాటిని తాము ఆనందంగా స్వాగతిస్తామని చెప్పారు. అసలు ఊరేగింపుపై ఉమ్మి వేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించడం లేదని చెప్పారు. పిల్లలు చాలా చిన్నవారని, వారికేమీ తెలియదని అన్నారు. ఊరేగింపు సందర్భంగా అన్ని దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారని, తాము లోపల విశ్రాంతి తీసుకుంటుండగా పిల్లలు పక్క భవనంపై టెర్రస్‌మీద ఆడుకుంటున్నారని చెప్పారు. ఊరేగింపులోని కొంతమంది పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన చేయడం చూశామని కానీ అవేమీ పట్టించుకోకుండా ఊరేగింపు అయిన తర్వాత సాధారణంగానే తమ దుకాణాలు తెరిచామని చెప్పారు. తమ ఇంటికి దగ్గర్లోనే పోలీసు స్టేషన్‌ వుందని, అక్కడి వారంతా తెలుసునని, అక్కడ నినాదాలు, నిరసనలు జరగడం కూడా సాధారణమేనని చెప్పారు. అయితే తమ పిల్లలను పోలీసు అధికారి పిలిచారని చెప్పగానే ఏదో చిన్నగా మందలించి పంపేస్తారనే భావనతో వెనక ఎవరూ లేకుండానే పిల్లలను స్టేషన్‌కు పంపామని హుస్సేన్‌ చెప్పారు. అయితే పోలీసు స్టేషన్‌లో పరిస్థితి భయంకరంగా వుందన్నారు. తమ పిల్లలను కస్టడీలోకి తీసుకున్నారని తెలియగానే దుకాణాలు మూసివేసి వెళ్లామని చెప్పారు. వారికి బెయిల్‌ కూడా ఇవ్వలేదన్నారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత 19న హుస్సేన్‌ ఇంటిని జిల్లా పాలనా యంత్రాంగం కూల్చివేసింది. ఆ ఇల్లు అక్రమ నిర్మాణమని అందుకే కూల్చివేస్తున్నామని 18న నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులో ‘అక్రమ నిర్మాణం’ అని రాసిన చోట ‘పమాదకరమైన భవనం’ అని మార్చారు. కేవలం అరగంట వ్యవధి ఇచ్చి కూల్చివేశారని, ఇంట్లో సామాను తీసుకోవడానికి ఆ సమయం సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. అయినా తమదిచట్టబద్ధంగానే కట్టిన ఇల్లంటూ అన్ని అవసరమైన పత్రాలు, అనుమతులు చూపించామన్నారు.

Spread the love