ఇంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులు సజీవదహనం

నవతెలంగాణ- భోపాల్‌: ఒక ఇంట్లో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోర్మి పోలీస్ స్టేషన్ పరిధిలోని దానేకపురా గ్రామంలో శనివారం ఉదయం ఒక ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు చిన్నారులు కాలి చనిపోయారు. మరణించిన పిల్లలను నాలుగేళ్ల బాలుడు, పదేళ్ల బాలిక, నాలుగేళ్ల మరో బాలికగా గుర్తించారు. ఇంటి యజమాని అఖిలేష్ రాజ్‌పుత్, అతడి భార్య, కూతురు, కోడలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన పిల్లలు ఇంటి యజమాని మనుమలని చెప్పారు. గాయపడిన కుమార్తె, కోడలను గోర్మిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వంట చేస్తుండగా సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు.

Spread the love