నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి, ప్రధాని

నవతెలంగాణ హైదరాబాద్: నేడు హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024’ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కన్హ శాంతివనంలో కార్యక్రమం పూర్తయ్యాక ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేందర్ మోడీ సైతం రాష్ట్రంలో నేడు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇక రేపు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాష్ట్రానికి రానున్నారు. ఇంకోవైపు ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉంది. ఒకేరోజు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కార్యక్రమాలు నగరంలో జరగనున్న నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రంజాన్‌ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని మోడీ ఇవాళ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఎస్‌పీజీ అధికారులు ఇప్పటికే ఒక విడత పరిశీలించారు. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిన్నటి నంచే ఆయా మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలను వేర్వేరు మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. బాంబు స్వ్కాడ్‌ తనిఖీలు నిర్వహించారు.

Spread the love