ఇంటర్‌ విద్య ఉద్యోగులకు బదిలీలు చేపట్టాలి

– మంత్రులు హరీశ్‌రావు, సబితకు టిప్స్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇంటర్మీడియెట్‌ విద్యలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్‌) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గురువారం టిప్స్‌ కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌, 475 సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణలో అందించిన సహకారం పట్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐదేండ్లుగా ఇంటర్మీడియట్‌ విద్యలో బదిలీల్లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణలో కొన్ని సమస్యలతో మిగిలిన ఒకేషనల్‌, పాస్‌ డివిజన్‌, డిగ్రీ కళాశాల అడిషనల్‌ క్వాలిఫికేషన్‌ కాంట్రాక్టు అధ్యాపకులు, 58 ఏండ్లు నిండిన వారిని కొనసాగించాలని కోరారు. ఆ కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు సహకరించాలని సూచించారు. మంత్రులు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు పై సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎవ్వరు కూడా అధైర్య పడొద్దని, అందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యోగులకు సాధారణ బదిలీలకు, కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్‌లను క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 475 సంఘం నాయకులు శోభన్‌ బాబు, మనోహర్‌, కోట్ల శైలజారెడ్డి, శ్రీనివాస్‌, మంజునాయక్‌, బీక్యా నాయక్‌, ఉదయశ్రీ, గణపతి, శ్రీనివాస్‌, సంగీత తదితరులు పాల్గొన్నారు.

Spread the love