ప్రతాప్‌.. ఇక పల్లెల్లో ఉండు

– వంటేరు ప్రతాప్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఆదేశం
నవతెలంగాణ -గజ్వేల్‌

‘ప్రతాప్‌.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక పల్లెల్లో ఉండు.. అందరూ కలిసి పల్లెల్లో తిరగండి.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటిలో ఏదో ఒకటి అందుతుంది.. అంతేకాకుండా వారికి ఉన్న సమస్యలను ఆరా తీయండి. ఈ నాలుగు నెలలు పల్లెల్లోనే ఉండి బీఆర్‌ఎస్‌ పార్టీని మరింత బలోపేతం చేయండి. మళ్లీ మనదే అధికారం..’ అని తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మెన్‌ వంటేరు ప్రతాపరెడ్డితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్న మాటలు ఇవి. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను వంటేరు ప్రతాప్‌ రెడ్డి కలిశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, జగదేపూర్‌, కొండపాక, మర్కుక్‌, తూప్రాన్‌, మనోహరాబాద్‌, కుక్కునూరు పల్లి మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. దశాబ్ది పాలనలో శతాబ్ది ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నాలుగు మాసాలు గ్రామాల్లో పట్టణాల్లో ఉండి తీరాలని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్నందున గజ్వేల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే ముందు వరుసలో ఉన్నామని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి మరిన్ని నిధులు కావాలని ముఖ్యమంత్రితో చెప్పడంతో వాటి కావాల్సిన ప్రతిపాదనలు వెంటనే సీఎం కేసీఆర్‌కు ప్రతాప్‌రెడ్డి అందించారు. గజ్వేల్‌ను మరింత అభివృద్ధి చేయాలని అక్కడే ఉన్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావుకు సీఎం సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలన్నారు. గతంలో మనం పరిశీలించిన పనులు సైతం 100 శాతం పూర్తి కావాలన్నారు. ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక నేతలకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

Spread the love