ఏక పక్ష చిల్లర నిర్ణయం

రెండువేల నోటు రద్దుపై దాసోజు ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రధాని నరేంద్రమోడీ రూ.2000 నోటును రద్దు చేయడం ఏకపక్ష చిల్లర నిర్ణయమని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఎద్దేవా చేశారు. అసంబద్ధమైన, అశాస్త్రీయమైన నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 2016లో నల్లధనాన్ని అరికట్టడంతోపాటు ఉగ్రవాదులను నియంత్రిస్తామనే కుంటి సాకుతో నోట్ల రద్దు చేశారని తెలిపారు. కానీ అది విధ్వంసం సృష్టించి 100 మందికి పైగా మరణాలకు కూడా కారణమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడు మిస్టీరియస్‌గా రూ.1000 నోటు స్థానంలో రూ.2000 నోటును ప్రవేశపెట్టారని తెలిపారు. ఆరున్నర ఏండ్ల తర్వాత, రూ. 2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి కీలక నిర్ణయం ప్రతిపక్ష పార్టీతోసహా వివిధ వాటాదా రులతో బహిరంగ చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయ పడ్డారు. మోడీ భారతదేశాన్ని తన వ్యక్తిగత ఆస్థిగా పరిగణిస్తున్నారని విమర్శించారు.
డీమోనిటైజేషన్‌ ఒక పెద్ద కుంభకోణంగా కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం కలిగిందో ప్రధాని మోడీ జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Spread the love