మ‌నకంటూ ఓ పునాది ఉండాలి

We must have a foundation for ourselvesసివిల్స్‌లో సెలక్ట్‌ కావాలంటే ఊపిరాడకుండా చదవాలి… క్షణం కూడా వేస్ట్‌ చేయకూడదు. అన్నీ పక్కన పెట్టి ఇదే ప్రపంచంగా భావించాలి. సివిల్స్‌ ప్రిపరేషన్‌కు రాక ముందు సాధారణంగా చాలా మంది ఇలాగే అనుకుంటారు. కానీ జాబ్‌ చేస్తూ కూడా గ్రూప్స్‌లో విజయం సాధించవచ్చు అని రుజువు చేసింది మన తెలుగమ్మాయి మోనిక అడుసుమిల్లి. మూడుసార్లు విఫలమైనా కుంగిపోలేదు. పట్టుదలతో ప్రయత్నించింది. పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే 487వ ర్యాంక్‌ సాధించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
మా అమ్మ సునీత, హౌజ్‌ వైఫ్‌. నాన్న వెంకట ప్రేమ్‌ చంద్‌, సొంత రెస్టారెంట్‌ వుంది. అమ్మనాన్నలకు నేనొక్కదాన్నే. ప్రస్తుతం మేము రాజమండ్రిలో ఉంటున్నాం. మా సొంతూరు విజయవాడ. పదో తరగతి వరకు అక్కడే మిషనరీ కాన్వెంట్‌లో చదువుకున్నాను. ఇంటర్‌ శ్రీచైతన్య కాలేజీలో పూర్తి చేశాను. తర్వాత హైదరాబాద్‌ బిట్స్‌ పిలానీలో ఇంజనీరింగ్‌ చేశాను. అది పూర్తి చేసిన వెంటనే జాబ్‌ వచ్చింది. మూడున్నరేండ్లు న్యూటానిక్స్‌ కంపెనీలో జాబ్‌ చేశాను. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో చేస్తున్నాను. జాబ్‌ చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను.
జాబ్‌ చేస్తూనే సివిల్స్‌…
కాలేజీ రోజుల నుండే సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ఉండేది. కార్పొరేట్‌ జాబ్‌లో ఉంటే సేవా కార్యక్రమాలు చేసే అవకాశం చాలా తక్కువ. చాలా పరిమితులు ఉంటాయి. వర్క్‌ టెన్షన్‌ ఉంటుంది. అదే సివిల్స్‌ అయితే మన జాబ్‌ సక్రమంగా చేస్తే చాలు, సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతామనే ఆలోచన ఉండేది. అందుకే జాబ్‌ చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. గతంలో మూడు సార్లు పరీక్షలు రాస్తే నాలుగో సారి సెలక్ట్‌ అయ్యాను. 487 ర్యాంక్‌ వచ్చింది. 2020లో మొదటి సారి పరీక్షలు రాశాను. ఇంటర్వ్యూకు వెళ్ళడం ఇదే మొదటి సారి. నాలుగో సారి పరీక్షలు రాసినప్పుడు ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు.

చాలా నేర్చుకున్నాను
మన తెలుగు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తెలుగు లిటరేచర్‌ ఆప్షనల్‌గా తీసుకున్నాను. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో బెంగుళూరులో జాబ్‌ చేస్తున్నాను. తెలుగులో కోచింగ్‌ ఎవరు బాగా ఇస్తారు అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటే హైదరాబాద్‌లో సత్యనారాయణ సార్‌ గురించి తెలిసింది. శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమీ తరపున ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యాను. కొన్ని రికార్డింగ్‌ క్లాసులు విని నోట్స్‌ రాసుకునేదాన్ని. తీసుకునేటప్పుడు చాలా ఆసక్తితో తీసుకున్నాను. కానీ మొదటి ఏడాది చాలా కష్టంగా అనిపించింది. చాలా టైం పట్టేది. రాయడం కూడా చాలా కష్టంగా ఉండేది. మెయిన్స్‌లో రెండు పేజీలు రాయడానికి ఏడు నిమిషాలే ఉంటుంది. ఇంగ్లీష్‌ అయితే కలిపిరైటింగ్‌ ఉంటుంది కాబట్టి స్పీడ్‌గా రాయొచ్చు. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. చాలా ఇబ్బందే అయ్యింది. ప్రాక్టిస్‌ చేస్తూ అలవాటు చేసుకున్నాను. వీడియోలు మళ్ళీ మళ్ళీ చూసి నేర్చుకున్నాను. శ్రీశ్రీ, గురజాడ గురించి చదువుతూ చాలా నేర్చుకున్నాను. ‘సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడుపడవోరు’ వంటివి చదివినప్పుడు సమాజం పట్ల మన బాధ్యత ఏమిటో తెలుసుకున్నాను.
నీకు నచ్చితే చెయ్యి అంటారు
ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్‌ చేస్తారు. ‘నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి’ అని ప్రోత్సహించారు. బిట్స్‌ పిలానీ అన్నా, జాబ్‌ అన్నా, సివిల్స్‌ అన్నా నీ ఇష్టం అన్నారు. ఇప్పటికీ నీ ఇష్టమైంది నువ్వు చెయ్యి అంటున్నారు. 25 ఏండ్లు వచ్చాయి పెండ్లి చేసుకో అంటూ ఇప్పటి వరకు ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకుంటే కచ్చితంగా నీకు నచ్చింది చెయ్యి అనే అంటారు. అమ్మాయిలకు సాధారణంగా చాలా ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి. అలాంటివి ఏవీ నాకు ఎదురు కాలేదు. సెలక్ట్‌ అయినా, కాకపోయినా ట్రై చెయ్యి అన్నారు. అయ్యో ట్రై చేయలేదే అనే ఫీలింగ్‌ ఉండకూడదు అని ప్రోత్సహించారు.
మన పని మనం టైంకి చేస్తే…
ఏ సర్వీస్‌కి అయినా దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. నాకు ఏ పోస్ట్‌ వచ్చినా దాని నుండి సమాజానికి నా వంతుగా ఏం చేయగలను అనే ఆలోచిస్తాను. ఎప్పటి పని అప్పుడు చేయడం అనేది నేను నేర్చుకున్న పాఠం. మన పని మనం టైంకి చేస్తే సమాజంలో చాలా పనులు వాయిదా పడకుండా జరిగిపోతాయి. కార్పొరేట్‌ ఉద్యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా ఏ రోజుకారోజు నా ప్రయత్నం వంద శాతం ఇవ్వాలి. ఇంటర్వ్యూలో ‘ఇప్పుడు నీకు లక్షల జీతం వస్తుంటే ఇటు ఎందుకు వస్తున్నావు’ అని అడిగారు. చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉంది.
ప్లానింగ్‌ చాలా అవసరం
నాకున్న అనుభవంలో సివిల్స్‌కు ప్రిపేర్‌ కావడమంటే గొప్ప విషయం. అయితే దీనికి ప్రిపేర్‌ అవుతూనే మనకంటూ వెనక ఓ పునాది వుండాలి. ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి రెండూ ఉండాలి. ఒక దానిపైనే ఆధారపడి ఉండొద్దు. ముఖ్యంగా సివిల్స్‌లో ప్లానింగ్‌ చాలా అవసరం. రెండు ప్లాన్లు ఉంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. మధ్యలో చాలా డౌట్స్‌ వస్తాయి. ‘ఎప్పటికైనా క్వాలిఫై కాగలమా, ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలమా’ అనే అనుమానాలు కచ్చితంగా వస్తాయి. అలాంటి వన్నీ పక్కన పెట్టి మనం చేయాల్సిన పని చేస్తుంటే కచ్చితంగా విజయం సాధించగలం అనిపించింది.
నా జాబే నాకు ధైర్యం
2019లో బెంగుళూరులో ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరి కొన్ని నెలలు వీకెండ్స్‌లో క్లాసులకు వెళ్ళాను. తర్వాత కోవిడ్‌ వల్ల ఇంట్లోనే ఉంటూ ప్రిపేర్‌ అయ్యాను. నాలుగు సార్లు పరీక్షలు రాశాను కాబట్టి ఆ అనుభవాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. ఒకసారి చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అలా నాలుగోసారి సెలక్ట్‌ అయ్యాను. మూడు సార్లు సెలక్ట్‌ కాకపోయినా ఎలాంటి బాధా కలగలేదు. ఎందుకంటే చేస్తున్న ఉద్యోగమే నాపై నాకు నమ్మకాన్ని ఇచ్చింది. చదువుకోడానికి కూడా టైం తక్కువ ఉండేది. అయినా జాబ్‌ని నేను ఎప్పుడూ భారంగా భావించలేదు. ఎందుకంటే జాబ్‌ నాకు ఓ ధైర్యాన్ని ఇచ్చింది. ఒక వేళ నేను సెలక్ట్‌ కాకపోతే నా పరిస్థితి ఏంటీ అని ఆందోళన పడాల్సిన పని లేదు. అందుకే నా జాబ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ‘నీకు నేనున్నాను’ అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్‌కి ఐఏఎస్‌, ఐపీఎస్‌లో రాదు. ఆడిట్స్‌, అకౌంట్స్‌, రైల్వేస్‌లో వచ్చే అవకాశం ఉంది.
– సలీమ

Spread the love