బీసీ జనగణనపై దాగుడుమూతలెందుకు?

Why the cover-up on the BC census?2024 పార్లమెంటు ఎన్నికల వ్యూహాల ‘మన్‌ కీ బాత్‌’ని ప్రధాని నరేంద్రమోడీ బయటపెట్టాడు. విదేశీ పర్యటనల అనంతరం దేశానికి రాగానే భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించాడు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ప్రతిపక్షాలు అకారణంగా ప్రజలను రెచ్చగొడుతున్నాయని, ఒకే దేశంలో రెండు చట్టాలను ఉండనీయమని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదని ప్రకటించాడు. యూసీసీ – యూనిఫాం సివిల్‌ కోడ్‌ (ఉమ్మడి పౌరస్మృతి)ని తేవాలని నరేంద్ర మోడీ తొందరపడుతుంటే… దానికంటే ముందు బీసీసీ – బీసీ సెన్సస్‌ (బీసీ జనగణన) చేపట్టాలని దేశంలోని మెజార్టీ వర్గాలైన బీసీ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. యూసీసీ అనేది మోడీకి తన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్దేశించిన లక్ష్యమైతే నరేంద్ర మోడీని ఓట్లేసి ప్రధాని పదవిలో కూర్చుండబెట్టిన మెజారిటీ ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ మాత్రం బీసీసీ వైపే నిలిచి ఉన్నది.
త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కలలో కులాల వారి జనాభా లెక్కలు సేకరించడంతో పాటు బీసీ వర్గాల జనగణన, వారి సామాజిక ఆర్థిక స్ధితిగతుల గణాంకాలనూ సేకరించాలనే డిమాండ్‌ నేడు దేశవ్యాప్తంగా బీసీ వర్గాలు ముందుకు తెస్తున్నాయి. ప్రభుత్వ నిధులు, సంక్షేమ పథకాల విషయంలో తమకు దక్కాల్సిన వాటా, తమ రిజర్వేషన్ల కోటా తేలాలంటే తమ జనాభా లెక్కలు తేలితేనే సాధ్యమవుతుందని ఆ వర్గాలు ఆశిస్తున్నాయి. నరేంద్ర మోడీ గొప్పగా చెప్పుకున్న సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అర్థం ఇదేనని సైతం వారు గుర్తుచేస్తున్నారు. బీసీ వర్గాల జనాభా లెక్కలు సేకరిస్తామని బీజేపీ ప్రభుత్వం సైతం గతంలో హామీనిచ్చింది. 2018లో పార్లమెంట్‌ వేదికగా నాటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 2021లో జరగనున్న జనాభా లెక్కలలో బీసీ జనగణన సైతం చేపడతామని తెలిపారు. అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గిన నరేంద్ర మోడీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కు తగ్గి బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే దేశంలో కులతత్వం పెరిగి పోతుందంటూ అహేతుక వాదనలను ముందుకు తీసుకొచ్చి, మెజారిటీ ప్రజల న్యాయమైన డిమాండ్‌ను తిరస్కరించాలని చూస్తున్నది.
మన దేశంలో జనాభా లెక్కల సేకరణ 1865లో మొదలైంది. బ్రిటన్‌లో ఉన్న పద్ధతికనుగుణంగా ప్రతి పదేండ్లకోసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ జరిగేది. బ్రిటిష్‌ హయాంలో జరిగిన జనాభా లెక్కలన్నింటిలోనూ కులగణన కూడా విధిగా చేసేవారు. ఆ విధంగా 1865 నుండి 1941 వరకు జరిగిన అన్ని జనాభా లెక్కల్లో కులాల వారీ జనాభా లెక్కలు సైతం సేకరించారు.1941లో జనాభా లెక్కల సేకరణ జరిగినా నాడు చెలరేగిన రెండవ ప్రపంచ యుద్ధపు అల్లకల్లోల పరిస్థితి కారణంగా ఆ రిపోర్టుల ప్రచురణ సరిగా జరగలేదు. ఆ విధంగా బ్రిటిష్‌ హయాంలో జరిగిన చివరి జనాభా లెక్కలుగా 1931 లెక్కలే సరిగా నమోదైనవని చెప్పుకోవాలి. స్వతంత్య్ర భారతదేశంలో మొదటి జనాభా లెక్కల సేకరణ 1951లో జరిగింది. నవ భారతంలో కులతత్వం సమసిపోతుందనే ఒక ఆదర్శ పూర్వక భావనతో నాటి ప్రభుత్వం కులగణన చేపట్టలేదు. 1950లో ఆమోదించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి కాబట్టి ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మాత్రమే సేకరించారు. 1980లో వెలుగు చూసిన మండల్‌ కమిషన్‌ నివేదిక ఎస్సీ, ఎస్టీల లాగా ఇతర వెనుకబడిన తరగతుల వారు సైతం అనేక రకాల వివక్షకు గురవుతున్నారని, ఆ వర్గాలకు విద్యావకాశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో సమప్రాతినిధ్యం ఇంకా దక్కలేదని తేల్చి చెప్పింది.
1990లో విశ్వనాధ్‌సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ నివేదికని ఆమోదించడంతోపాటు, బీసీ వర్గాలకు విద్యావకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్స్‌ సౌకర్యం కల్పించింది. మండల్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికలో జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్‌ పరిమాణం ఉండాలని తేల్చిచెప్పి, తాజా లెక్కలు లేవు కాబట్టి 1931 నాటి జనాభా లెక్కలనే ప్రాతిపదిక తీసుకుని బీసీ రిజర్వేషన్లను 27శాతంగా నిర్ణయించింది. బీసీల రిజర్వేషన్‌ సక్రమంగా అమలు కావాలంటే రాబోయే జనాభా లెక్కల్లో విధిగా బీసీ వర్గాల జనాభా లెక్కలు సైతం సేకరించాలని మండల్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. దానికనుగుణంగా 1996లో నాటి దేవగౌడ ప్రభుత్వం… 2001లో జరగనున్న జనాభా లెక్కల్లో బీసీల జనాభా లెక్కలు తేల్చాలని పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రకటించింది. ఆనాడు అధికారంలో ఉన్న వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం… ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలకు అనుగుణంగా.. ‘మా ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టబోదు’ అంటూ ప్రకటించింది. ఆ కారణంగా స్వతంత్య్ర భారతదేశంలో చేపట్టాల్సిన మొట్టమొదటి బీసీ జనగణన అటకెక్కింది. 2011నాటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం దశాబ్దపు జనాభా లెక్కల్లో కాకుండా… ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు సేకరించి… సదరు నివేదిక వెలువడక ముందే దిగిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2011 బీసీ జనగణన నివేదికని విడుదల చేయకుండా తొక్కిపట్టేసింది.
అధికార బీజేపీ పార్టీకి మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌ మొదటినుంచీ మనుస్మృతిని శిరోధార్యంగా భావిస్తూ వస్తున్నది. మనుస్మృతిని అమలు పరచడమే తమ ఉద్దేశమని ఎన్నోమార్లు స్పష్టంగా తెలిపిన సంస్థ అది. మనుస్మృతి సమాజంలోని మైనారిటీ వర్గాలకే పెద్దపీట వేసిందని… మెజారిటీ వర్గాల ప్రయోజనాలకు మనుస్మృతి వ్యతిరేకమని మహాత్మాఫూలే, అంబేద్కర్లు తమ పరిశోధనలలో నిగ్గు తేల్చారు. ”బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి సేవ చేయటం (మనుస్మృతి 1-91) శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు (మను 4-99)” అనేవి మనుస్మృతి చాటి చెప్పిన కొన్ని ఆణిముత్యాలు! ఆ భావజాలానికి అనుగుణంగానే బీజేపీ పార్టీలోని అగ్ర నాయకులు బహుజన వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎన్నోమార్లు మాట్లాడారు. నరేంద్ర మోడీ మొదటి ప్రభుత్వ హయాంలో లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్‌ ”బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు? తాము అను భవిస్తున్న రిజర్వేషన్ల కారణంగా సమాజ విచ్చిన్నానికి కారకులమవు తున్నామని బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల ప్రజలు గుర్తించా లంటూ” వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఓబీసీ మోర్చా నాయకులు కె.లక్ష్మణ్‌ సైతం… బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దుచేసి ఆర్థిక ప్రాతిపదికన అందరికీ రిజర్వేషన్స్‌ కల్పించాలని పేర్కొన్నారు. ఈ రీతిన స్పష్టమైన మనువాద అనుకూల వైఖరి కలిగి ఉన్నారు. కాబట్టే బీజేపీ నాయకులు బీసీ జనగణనకు మోకాలడ్డుతున్నారని నేడు బీసీ వర్గాల ప్రజలు భావిస్తున్నారు.
2021 ఆగస్టు 23న బీహార్‌ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ నాయకత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి… రానున్న జనాభా లెక్కల సేకరణలో భాగంగా బీసీవర్గాల జన గణన సైతం చేపట్టాలని డిమాండ్‌ చేయడంతో ఈ ఉద్యమం కొత్త రూపం తీసుకున్నది. ”ఈ దేశంలో కుక్కలకి, కోళ్ళకి, పశుసంపదకు సైతం లెక్కలు ఉంటాయి.. మా బీసీ వర్గాల జనాభా ఎంతో తేల్చడానికి అభ్యంతరం ఏమిటి?” అంటూ ఆ రోజు బీహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ వేసిన ప్రశ్న… మెజారిటీ ప్రజల మనోగతాన్ని తెలియజేస్తున్నది. నేడు దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ జనగణనకి మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేడీయూ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆప్‌, బీజేడీ, డీఎంకే, టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైఎస్సార్సీపీలు సైతం బీసీ జనగణనకు మద్దతు తెలిపాయి. తెలంగాణ, ఏపీ, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాల అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. బీజేపీ సైతం అధికారంలో రాకముందు స్వయంగా బీసీ జనగణనకు మద్దతునిచ్చింది. కాబట్టి ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయం ఉన్నదని నిరూపితమైంది. అయినా నరేంద్రమోడీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడాన్ని మెజార్టీ వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సామాజిక వివక్షకు గురైన తమకు సామాజిక న్యాయం అందించాలని ఒకవైపు బీసీ వర్గాలు ఉద్యమిస్తుంటే వారి ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీసేలా అగ్రవర్ణాల 10శాతం రిజర్వేషన్స్‌కు నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరోవైపు రిజర్వేషన్లకు ఆధారంగా నిలిచిన ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ దూకుడుగా సాగుతున్నది. ఈ పరిణామాలతో మరింత అగ్రహించిన బడుగులు జనాభాలో తమ శాతమెంతో, ప్రభుత్వ పథకాలలో తమకు దక్కుతున్న వాటా ఎంతో నిగ్గుతేల్చాలని నిలదీసి అడుగుతున్నారు.
కులాల వారీ జనాభా లెక్కలు సేకరిస్తే దేశంలో కులతత్వం పెరిగిపోతుందనే వాదనలో ఎలాంటి హేతుబద్ధతా లేదు. ప్రభుత్వ గణాంకాలకు ఆయా వర్గాల మనోభావాలకు ఎలాంటి సంబంధం లేదు. గణాంకాల సేకరణ ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా నేడు దేశంలో నెలకొన్న పరిస్థితిని గణాంకాలు తేల్చిచెబుతాయి. ఏ దేశంలోనైనా గణాంకాల సేకరణ విషయంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ ఇష్టాలను రుద్దే రీతిలో ప్రవర్తించరు. నేటి వరకు కొనసాగుతున్న విధానంలో భాగంగా జనాభా లెక్కల్లో ఆయా మతాల వారీ లెక్కలు సేకరిస్తున్నారు. వివిధ భాషలను మాట్లాడేవారి జనాభా ఎంతో సైతం తేలుస్తున్నారు. జనాభా లెక్కల కారణంగా మత వైషమ్యాలు పెరుగుతున్నాయని, భాషా విభేదాలు చెలరేగుతున్నాయనే వాదనలు నేటివరకు ఎవ్వరూ లేవనెత్తలేదు. కులాల వారీ జనాభా లెక్కల సేకరణ సైతం అదే రీతిలో ఎలాంటి అవాంఛిత పరిణామలకు దారి తీయదు. సామాజిక వివక్ష కారణంగా సమ అభివృద్ధికి నోచుకోని వర్గాలకు సామాజిక న్యాయం అందించడానికి తోడ్పడడంతో పాటు ఆయా వర్గాల ప్రజల మధ్య అనవసర గొడవలను నివారించి దేశ ఐక్యతకు సహకరిస్తుంది ఆ విధానం. బీసీ జనగణన చేపట్టడానికి నయా పైసా అదనపు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. జనాభా లెక్కల సేకరణ పత్రంలో 8వ కాలంలో ప్రస్తుతం ఇలా ఉన్నది: ”ఇతడు/ ఈమె, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారా? అయిన పక్షంలో ఎస్సీ అయితే 1 అని, ఎస్టీ అయితే 2 అని పక్కనున్న బ్రాకెట్‌లో రాయండి” అని ఉంటుంది. బీసీ జనగణన చేపట్టడానికి అదే కాలంలో ”సదరు వ్యక్తి ఓబీసీ అయితే 3 అని రాయండి” అని సవరిస్తే సరిపోతుంది.
దేశ ప్రజలకు సామాజిక న్యాయం అందించడమనేది ఆయా వర్గాలకు అందించే భిక్షగా భావించరాదు. దేశ పునర్మిర్మాణ ప్రక్రియలో అది ఒక భాగం. ఈ దేశంలో గతంలో రెండువేల ఏండ్లుగా అమలైన సంకుచిత మనుస్మృతి విధానాల కారణంగా మెజారిటీ శ్రామిక వర్గాలు వివక్షకు గురయ్యారన్న వాస్తవాన్ని గుర్తించి వారికి దక్కాల్సిన సమన్యాయం అందించే ప్రక్రియ దేశ ప్రజల మధ్య ఐక్యత పెంపొందిస్తుంది. అదే అసలైన దేశాభివృద్ధి. వివిధ వర్గాల ప్రజల మధ్య కొనసాగుతున్న అసమతుల్య అభివృద్ధి… ప్రజల మధ్య విభేదాలను పెంచి పోషించడంతో పాటు దేశ ఐక్యతకు విఘాతంగా నిలుస్తుంది. మహాత్మ ఫూలే, అంబేద్కర్లు కోరుకున్న రీతిలో ప్రజలకు సామాజిక న్యాయం అందించడమనేది ఈ దేశ పాలకులు తాము చేపట్టాల్సిన తప్పనిసరి కర్తవ్యంగా స్వీకరించాల్సిన అవసరం ఉన్నది.

ఆర్‌. రాజేశమ్‌
సెల్‌: 9440443183

Spread the love