నాన్నకు ప్రేమతో…

తను కొవ్వొత్తిలా కరిగి బిడ్డల జీవితాల్లో వెలుగు నింపుతాడు. తన జీవితం మొత్తం పిల్లల విజయానికై శ్రమిస్తాడు. మన ఆశలే తన ఆయువుగా, మన గెలుపే తన లక్ష్యంగా, మన జీవితాన్ని నిలబెట్టేందుకు.. మన కోసం నిత్యం శ్రమించిన నిస్వార్థ శ్రామికుడు. ఎన్నో బాధ్యతల్ని నెత్తిన మోస్తూ… పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. తన కలలు, ఆశయాలు, ఆశలు అన్నీ వదిలేసుకొని పిల్లలే ప్రపంచంగా భావిస్తాడు. వాళ్లకు ఓ జీవితాన్ని అందిస్తాడు. వాళ్లు తప్పటడుగులు వేసిన ప్రతిసారీ… సరిదిద్దే బాధ్యతను తనే మోస్తాడు. పిల్లల ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటాడు. అతడే నాన్న. బిడ్డల్ని అమ్మలా లాలించే తండ్రులు సైతం ఎందరో ఉన్నారు. పిల్లలకు అన్నీ తామై తండ్రిలా బాధ్యత వహిస్తున్న ఒంటరి తల్లులు మరెందరో ఉన్నారు. వీరందరికీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.
అమ్మలేని లోటు తీర్చాడు
అమ్మ లక్ష్మీ, నాన్న శ్రీనివాస్‌ రావు. మా అన్నయ్య రాజేష్‌. తను ఫోటోగ్రాఫర్‌. నేను పుట్టింది హనుమాన్‌ జంక్షన్‌లో. అయితే కొన్నాళ్ళు గుడివాడలో పెరిగాను. అది మా స్వగ్రామం. మా తాతయ్యకు సౌండ్‌ సర్వీస్‌ ఉండేది. అంటే సభలకు, ప్రోగ్రాంలకు మైక్‌ సిస్టం ఏర్పాటుచేయడం. దాదాపు 60 ఏండ్లుగా అదే వృత్తిలో ఉన్నారు. అలా సౌండ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయడానికి తాతయ్యతో పాటు నేనూ వెళ్ళేదాన్ని. భయం లేకుండా డాన్సులు చేయడం చేసేదాన్ని. అనుకోకుండా మేము హైద్రాబాద్‌కి రావలసి వచ్చింది. నాన్న ఇంటీరియర్‌ డిజైనింగ్‌, కార్పెంటర్‌ పనులు చేసేవారు. ఒక సారి అనుకోకుండా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇంట్లో పని చేసే అవకాశం వచ్చింది. వాళ్ళింట్లో ఒక ఫంక్షన్‌ జరుగుతున్నప్పుడు మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడకి వచ్చిన నటీనటులతో ఫొటోలు తీసుకుంటూ సందడి సందడిగా ఉంటే, ఓ తమిళ్‌ డైరెక్టర్‌ నన్ను చూసి నా వివరాలు అడిగి తెలుసుకుని సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. అప్పుడు నాన్న ‘మనకు ఎటువంటి సినిమా నేపధ్యం లేకపోయినా అవకాశం వచ్చింది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ సినిమాలకు సంబంధించిన వన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను’ అని ప్రోత్సహించారు. నాకు నటనంటే అసలు తెలియదు. నాన్న దాదాపు 300 డి.వి.డి కాసెట్లు తెచ్చి శ్రీదేవి, సావిత్రి, సౌందర్య ఇలా మొదలైన మహా నటీమణుల నటనను గమనిస్తూ వుండమనేవారు. నా ఆహార విషయంలో శ్రద్ధ పెట్టేవారు. షూటింగ్స్‌ వెళ్ళేటప్పుడు మొదట్లో అమ్మ, నాన్న ఇద్దరూ వచ్చేవారు. అమ్మకు అనారోగ్యం మొదలయినప్పటి నుండి నాన్న ఒక్కడే వచ్చేవాడు. అమ్మ అనారోగ్య రీత్యా సినిమాలు చేయకూడదనుకున్నాను. ఎందుకంటే షూటింగ్స్‌ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ల వలసి వచ్చేది. అమ్మను చూసుకోవడానికి వీలుగా తెలుగు సీరియల్స్‌లో నటించడం మొదలు పెట్టాను. అమ్మ పోయిన ఏడాదికి నా పెండ్లి చేశారు. నేను గర్భవతిని అయ్యాక ఇంటికి తీసుకొచ్చి నాకేం కావాలో అన్నీ అడిగి మరీ చేసిపెట్టేవాడు నాన్న. అమ్మ లేని లోటు తెలియనివ్వలేదు. నాన్న నాలుగు నెలల కిందట కన్నుమూశారు. నాన్న రుణం తీర్చుకోలేనిది.
– విష్ణు ప్రియ, బుల్లితెర నటి
నా ధైర్యం నాన్న
నాన్న తిరుపతయ్య. అమ్మ సుగుణ. నాకొక చెల్లెలు. నాన్న బి.హెచ్‌.ఈ.ఎల్‌.లో ఇ.డి కి పి.ఎ గా చేసేవారు. ఇంట్లో నన్ను ఎంతో గారబంగా, ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజుల్లోనే స్కూటర్‌, భారీ వాహనాలు నడపటం నేర్చుకున్న. నాన్నకు సావిత్రి సినిమాలంటే చాలా ఇష్టం. వర్షం పడుతుంటే ఇద్దరం పకోడీలు తింటూ సావిత్రి సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమాలు చూస్తూ ఆవిడ నటన, అభినయాలు నా మనసులో ముద్రించుకు పోయాయి. మావి చిగురు సినిమాలో ఆమని నటన చూసి నేనూ నటించాలని నిర్ణయించుకున్న. నాన్నకు చెబితే ఒప్పుకోలేదు. బంధువులు ఏమనుకుంటారో, మనది సినీ కుటుంబం కాదు కదా అని ససేమిరా అన్నారు. వెంటనే పెండ్లి చేసి పంపించేశారు. అయిన నా మనసులో కోరిక అలాగే ఉండి పోయింది. నా కోరికను మా వారికి చెబితే ఎంతో ప్రోత్సహించారు. అయితే నేను నటిస్తున్న విషయం నాన్న వాళ్లకు తెలియకుండా నాలుగేండ్లు జాగ్రత్త పడ్డాను. కంప్యూటర్‌ క్లాసులకు వెళ్తున్నానని చెప్పేదాన్ని. తర్వాత తెలిసింది. అయిష్టంగానే ఒప్పుకున్నారు. నా ముందు మెచ్చుకోక పోయినా బైటి వాళ్ళతో మా అమ్మాయి బాగా నటిస్తోంది అని చెప్పుకుని సంతోషించేవారు. కథలో బలం ఉన్నవి, కుటుంబంతో చూడ దగ్గ సినిమాలు ఎంచుకోమని సలహా ఇచ్చేవారు. నిబద్ధతతో పని చేయాలని చెప్పేవారు. నా థైర్యం నాన్న. ఆయన మరణించినా ఎప్పుడూ నాతోనే ఉన్నారనే అనే భావన. నాన్న జ్ఞాపకాలే నా ఊపిరి.
– జయవాణి, సినీ నటి
నిస్వార్థ శ్రామికుడు
నాన్న బందా శ్రీరామశర్మ, పే ఎండ్‌ అకౌంట్స్‌లో ఉద్యోగి. అమ్మ చంద్రా వతి. వారికి మేము ఐదుగురం పిల్లలు. మా స్వగ్రామం వేటపాలెం. నాన్న ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పెరిగాము. నాన్నకు నేను శాస్త్రవేత్త కావాలని అనుకున్నారు. ఆయనకు లెక్కలన్నా, సైన్స్‌ అన్నా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచీ సైన్సుపై శ్రద్ధ పెరగడానికి నాన్నే కారణం. ఏ ఊరు బదిలీ అయిన ముందుగా ఆ ఊర్లో మంచి పాఠశాలలు ఏమొన్నాయో కనుక్కుని, ఉపాధ్యాయులతో మాట్లాడి, దగ్గరుండి మమ్మల్ని పాఠశాలల్లో చేర్పించేవారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించే వారు. ప్రధమ స్థానం చదువుదే అయినా ఆటల్లో కూడా ప్రోత్సహించేవారు. నేను తొమ్మిదో తరగతి వరకు జిల్లా స్థాయిలో ఖో ఖో ఆడదాన్ని. ప్రతి శనివారం స్నేహితులతో సినిమాకు పంపేవారు. వేసవి సెలవల కోసం ఎంతో ఎదురు చూసేవారం. ఎందుకంటే సెలవలు రాగానే ఏదో ఒక ఊరు తప్పనిసరిగా తీసుకుని వెళ్లేవారు. వాటి చరిత్ర, ప్రాముఖ్యత, శిల్పకళా నైపుణ్యం మొదలైన అంశాల గురించి వివరంగా చెప్పేవారు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా తాను తెలుసుకుంటూ మాకు చెప్పేవారు. విజ్ఞానానికి బాగా ప్రాధాన్యం ఇచ్చేవారు. కష్టాల్లో ఉన్నవారిని చూసి చలించి పోయేవారు. మేము ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే వారు. నేను శాస్త్రవేత్తను అయినందుకు నాపై ప్రత్యేక అభిమానం. నన్ను చూసి కాస్త గర్వంగా కూడా ఫీల్‌ అవుతారు. జీవితంలో క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పరిష్కరించుకోవాలో నేర్పారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి నాన్నే కారణం. నా ఆశలే తన ఆయువుగా, నా గెలుపే తన లక్ష్యంగా, నా జీవితాన్ని నిలబెట్టేందుకు.. నా కోసం నిత్యం శ్రమించిన నిస్వార్థ శ్రామికుడు మా నాన్న.
– బందా రుక్మిణి, శాస్త్రవేత్త

Spread the love