క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొండాని అంజయ్య, పిరమిడ్ సేవాదళ్ నిజామాబాద్ కన్వీనర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవం నాడే యోగా చేయడం కాకుండా నిరంతరం చేయాలని, ఆరోగ్యాన్ని  సంరక్షించుకునేందుకు, మానసిక సమతౌల్యత కోసం యోగా మెడిటేషన్ విధిగా చేయాలని విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ యుక్త వయసులో శుద్ధ శాఖాహారాన్ని స్వీకరించాలని దానివల్ల సాత్విక గుణాలు అలవాటు పడతాయని, తద్వారా చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు వారు దూరంగా ఉండగలరని, తద్వారా జాతి నిర్మాణానికి వారు కృషి చేయగలరని అన్నారు. ఆర్మూర్ పట్టణం యోగ భూమి అని ఇక్కడ నవనాధ సిద్ధులు నాసిక్ నుండి వచ్చి యోగ తపస్సు మెడిటేషన్ ద్వారా సిద్ధి పొందారు, కాబట్టి ఇంతటి పుణ్యభూమిలో చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులు కాగలరని అన్నారు. క్షత్రియ విద్యా సంస్థల సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ యోగా సనాతన ధర్మం నుండి ఉద్భవించిందని దానికి ఈరోజు అంతర్జాతీయ ఖ్యాతి యోగా దినోత్సవం ద్వారా పొందిందని యోగా నిరంతరం విద్యార్థులు చేయాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే మాట్లాడుతూ తానే దగ్గరుండి రోజు విద్యార్థులకు యోగ మెడిటేషన్ చేపిస్తానని, విద్యార్థులు అందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇంచార్జ్ పి శివరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షత్రియ టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love