అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలి

–   కేరళను అవమానించారని డీవైఎఫ్‌ఐ నిరసనలు
–  కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సీఎం విజయన్‌
తిరువనంతపురం : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కర్నాటకలో చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి. కేరళను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రిపై డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యకం చేశారు. కేరళలో నిరసనలకు దిగారు. అమిత్‌ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటు కేరళ సీఎం పినరయి విజయన్‌ కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రం కర్నాటకలోని పుత్తూరులో అమిత్‌ షా ఇటీవల పర్యటించారు. రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకోవాలంటే ప్రజలు బీజేపీకి మద్దతు పలకాలన్నారు. ” పొరుగునే కేరళ రాష్ట్రం ఉన్నది. నేను ఇంతకు మించి ఏమీ మాట్లాడదల్చుకోలేదు. మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలనలోనే కర్నాటక సురక్షితంగా ఉంటుంది” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కేరళలో తీవ్ర దుమారానికి దారి తీశాయి. డీవైఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా 300 బ్లాకుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దిష్టిబొమ్మలను దహనం చేసింది. అలాగే, రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన లక్ష్యాలను వివరిస్తూ పోస్టర్‌ ప్రచారాన్ని చేసింది. కేరళ సాధించిన లక్ష్యాలను అమిత్‌ షా అవమానించారనీ, రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలను విజయన్‌తో పాటు ఇతర మంత్రులు, సీపీఐ(ఎం) కేరళ కమిటీ ఖండించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Spread the love