పోరాటాల ఫలితంగానే కార్మికుల వేతనాలు పెంపు

–  పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం
–  వచ్చేనెల 13న కలెక్టరేట్ల ముట్టడి : మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచిందని మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్‌ పేర్కొంది. పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 13న కలెక్టరేట్లను ముట్టడించాలని పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు టి.చక్రపాణి అధ్యక్షతన రాష్ట్ర విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వి రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గత ఎనిమిదేండ్లుగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. నిరంతరం పోరాటాల మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం రూ. 2000 పెంచుతూ జీవోనెంబర్‌ 8ని విడుదల చేసిందని తెలిపారు. ఆ జీవోను 2022 మార్చిలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు వేతనాలను అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చిందనీ, కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్రం ఎలాంటి సహయ సహకారాలు అందించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఇందూరి సులోచన, దాసరి కళావతి, సిహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌, సత్యనారాయణ, సుల్తాన్‌, యాక లక్ష్మి, మాయ గీత తదితరులు పాల్గొన్నారు.

Spread the love