హోమియోపతి వైద్యశాలలో 2గంటలే వైద్యసేవలు

– 11గంటలకు తెరిచి ఒంటిగంటకు మూసివేత
నవతెలంగాణ- ఆలేరు రూరల్‌
ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి రెండు గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 6:00 గంటలు పని చేయాలి కానీ మండలంలోని కొలనుపాక గ్రామంలో 1998లో హోమియోపతి ఆస్పత్రిని ప్రారంభించారు. అప్పటినుండి ఎంతోమంది హోమియోపతి డాక్టర్లు బదిలీ అయ్యారు. కానీ 8 ఏండ్ల కింద వచ్చిన వైద్యురాలు లలిత ఇప్పటికి కూడా కొనసాగుతుంది. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉదయం 11 గంటలకు వైద్యశాలకు వచ్చి మళ్లీ తిరిగి ఒంటిగంట సమయం దాటగానే వైద్యశాలకు తాళం వేసి వారు నివాసముంటున్న హైదరాబాద్‌కు వెళ్తున్నారు .కొలనుపాక గ్రామానికి ఆనుకొని ఉన్న చుట్టుపక్కల గ్రామాలైన రాఘవపురం, పటేల్‌ గూడెం ,శ్రీనివాసపురం, దూది వెంకటాపురం, నమిలే, పెద్దరామరచర్ల ,చిన్న రామచర్ల, సోమరం ,బొందుగుల గ్రామాల నుండి అధిక సంఖ్యలో హోమియోపతి మందులకు అలవాటు పడ్డ రోగులు, వృద్ధులు నిత్యం వస్తున్నారు. వారు వచ్చినప్పుడు వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడం, అసలే ఎండాకాలం కావడంలో ఇబ్బందులు పడుతున్నారు. చూసిచూసి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. వారానికి రెండు రోజులు కూడా హోమియోపతి వైద్యశాలకు రావడం లేదని, వచ్చినా గాని రెండు గంటలు మాత్రమే ఉండి వెళ్లిపోతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫోను లేదు ఏమీ లేదు పో…
ఆస్పత్రికి వచ్చిన డాక్ట్‌ర్‌ను వృద్ధులు అడిగితే… ‘డాక్టర్‌ అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు మేము దావకానకు ఎప్పుడు రావాలి అని ఫోన్‌ చేసి అడుగుదామంటే ఫోను లేదు ఏమీ లేదు పో నేను వచ్చినప్పుడు దావకాన ఉంటది అప్పుడు చూపించుకోవాలి’ అని సమాధానం చెబుతుంది. కనీసం ప్రజాప్రతినిధులకు అధికారులకు కూడా ఫోన్‌ నెంబర్‌ ఇవ్వకపోవడంతో చుట్టుపక్కల నుండి వచ్చే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై ఉన్నత అధికారులు చొరవ తీసుకొని వైద్యు రాలు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Spread the love